AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు! ముఖ్యంగా ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
Rains In Telangana
SN Pasha
|

Updated on: Jun 30, 2026 | 2:26 PM

Share

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD), హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంగళవారం (జూన్ 30) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జూలై 1, 2 తేదీల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశముండగా, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు రోజులూ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 30 నాటికి రుతుపవనాలు మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాలు, అలాగే హిమాచల్ ప్రదేశ్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి తూర్పు-మధ్య అరేబియా సముద్రం వరకు మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్-గోవా మీదుగా సుమారు 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. నిన్న ఉత్తర తెలంగాణ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం బలహీనపడినప్పటికీ, రాష్ట్రంలో వర్షాలకు అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us