Hyderabad: హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్..
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించే హైరైజ్ భవనాలకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ తప్పనిసరి చేస్తూ జలమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఉంటేనే హైరైజ్‌లకు అనుమతులు మంజూరు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలో పెరుగుతున్న నీటి డిమాండ్, భూగర్భ జలాల సంరక్షణ, భవిష్యత్ నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో భూగర్భ జలాలను పెంపొందించడానికి, భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో నీటి సరఫరాలో ఇబ్బందులను తగ్గించేందేకు జలమండలి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సిటీలో కొత్తగా నిర్మించే హైరైజ్ భవనాలకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విధిగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఇకపై వాటర్ హార్వెస్టింగ్ ఉంటేనే హైరైజ్‌లకి పర్మిషన్ ఇస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉన్నవాటర్ సోర్స్‌లు దశాబ్దాలుగా పెరగలేదు కానీ కనెక్షన్లు మాత్రం ఏటా వేలు, లక్షల్లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిటీలో 14.5లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, మిడ్ సమ్మర్‌లో రోజూ 15వేల ట్యాంక్‌ల బుకింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రోజూ 9వేల ట్యాంకర్ల ద్వారా జలమండలి నీటిని సరఫరా చేస్తోంది.
వర్షాలు పడకపోతే హైదరాబాద్ సిటీలో డిసెంబర్ నుంచి నీటి సరఫరాకి ఇబ్బందులు తప్పవని జలమండలి ముందుగానే అలర్ట్ చేస్తోంది. కొత్తగా నిర్మించే భవనాలతో పాటు ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసుకోవాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచిస్తున్నారు.
అయితే.. జలమండలి సూచనలు పాటించి నగరవాసులు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌పై దృష్టిపెడితేనే భవిష్యత్‌లో హైదరాబాద్ నగరంలో నీటి కష్టాలు తగ్గే అవకాశం ఉంది. సిటీ దాహార్తిని తీర్చేందుకు వాటర్ సోర్స్‌లు పెంచేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
