కేతన్ హత్యకు రిహార్సల్ లవర్‌తో కలిసి సియా స్కెచ్ వెలుగులోకి సీసీ ఫుటేజ్
యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి నెలల ముందే హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గూగుల్ సెర్చ్‌లు, డిలీట్ చేసిన డేటా, కాల్ రికార్డులు, పాస్‌పోర్టు అదృశ్యం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇవన్నీ ప్రాథమిక దర్యాప్తు వివరాలేనని, తుది నిజాలు కోర్టు విచారణలోనే తేలనున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. మొదట్లో ప్రమాదంగా భావించిన ఈ ఘటన.. తర్వాత క్రూరమైన హత్యగా తేలడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ ప్రవర్తన ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. అసలు కేతన్‌ను ఎందుకు హత్య చేశారు? ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదట ప్రేమ కోసం జరిగిన హత్యగా భావించిన ఈ కేసులో ఇప్పుడు మరో కీలక కోణం బయటపడింది. లోయలోకి తోసేసిన తర్వాత కేకలు వేస్తూ ఏడ్చిన సియా.. కేతన్ ఊపిరితోనే ఉన్నాడని అక్కడి సహాయక సిబ్బంది చెప్పగానే ఒక్కసారిగా షాక్‌కు గురైందని కేతన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ తర్వాత ఆమె మౌనంగా, ముభావంగా ఉండిపోయిందని కేతన్ తండ్రి చెబుతున్నారు. ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి కేతన్ హత్యకు నెలల ముందే పక్కా ప్రణాళిక రచించినట్లు తేలింది. అయితే ఘటన జరిగిన రోజు సియా వ్యవహరించిన తీరుపై తాజాగా బయటపడిన వివరాలు ఈ కేసును మరింత కీలక మలుపు తిప్పాయి. ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ హత్యకు దాదాపు నాలుగు నెలల ముందే కుట్ర మొదలైందని పోలీసులు చెబుతున్నారు. ఫిబ్రవరి నుంచే ఇద్దరూ కేతన్‌ను ఎలా హత్య చేయాలనే అంశంపై ప్రణాళిక రూపొందించడం ప్రారంభించారని సమాచారం. హత్యకు ముందు ఇద్దరూ గూగుల్‌లో “ఎలా హత్య చేయాలి?”, “ఆధారాలు ఎలా మాయం చేయాలి?” వంటి అంశాలపై సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. మహారాష్ట్రలోని పుణే సమీపంలోని లోహగడ్ కోటకు ముందుగానే వెళ్లి హత్యను ఎలా అమలు చేయాలనే అంశంపై రిహార్సల్ కూడా చేసినట్లు అధికారులు వెల్లడించారు. హత్య అనంతరం పోలీసులు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలి? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలను కూడా ముందుగానే ప్రాక్టీస్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య సమయంలో తమపై అనుమానం రాకుండా ఉండేందుకు వేషధారణ మార్చుకోవాలనే ప్రణాళిక కూడా వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, కేతన్ తండ్రి ఆరోపణల ప్రకారం.. జూన్ 18 ఉదయం సుమారు 10.30 గంటలకు కేతన్ లోయలో పడిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అక్కడికి చేరుకున్న ఓ అధికారి.. “కేతన్‌లో ఇంకా ప్రాణం ఉంది.. వెంటనే ఆసుపత్రికి తరలించాలి” అని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆ మాట విన్న వెంటనే సియా గోయల్ ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయిందని కేతన్ తండ్రి ఆరోపించారు. అంతకుముందు ఏడుస్తూ, తీవ్ర ఆందోళనలో కనిపించిన సియా.. కేతన్ బతికే ఉన్నాడని తెలిసిన వెంటనే మౌనంగా మారి, మరింత ఆందోళనకు గురైనట్లు ఆయన చెప్పారు. ఈ పరిణామం ఇప్పుడు దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ప్రధానంగా పరిశీలిస్తున్న కోణం కూడా ఇదే. ఒకవేళ కేతన్ ప్రాణాలతో బయటపడితే.. జరిగిన అసలు విషయం బయటపడుతుందనే భయం సియా గోయల్‌కు కలిగిందా? అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. కేతన్ స్పృహలోకి వచ్చి నిజం చెబితే మొత్తం కుట్ర బయటపడే అవకాశం ఉందనే కారణంతోనే ఆమె ప్రవర్తన ఒక్కసారిగా మారిందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ముందుగానే ఈ హత్యకు ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సియా ప్రియుడు చేతన్, తాను కెరీర్లో స్థిరపడాలని, అందుకోసం కనీసం మూడేళ్ల సమయం కావాలని సియాను కోరినట్లు తెలుస్తోంది. కానీ అప్పటికే, కేతన్‌తో సియాకు వివాహం నిశ్చయం కావడంతో, ఈ క్రమంలోనే ఇద్దరూ కేతన్‌ను చంపేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఫలితంగా కొన్ని సంవత్సరాలు సియా వివాహం జరిగే అవకాశం ఉండదని, ఈ సమయంలో చేతన్ తన కెరీర్‌పై దృష్టి సారించి ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చునని అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. సియా, చేతన్ ఇద్దరూ హత్యకు ముందు, తర్వాత తమ మొబైల్ ఫోన్లలోని చాట్ హిస్టరీ, రీసైకిల్ బిన్‌లోని సమాచారాన్ని కూడా పూర్తిగా తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసే పనిలో ఉన్నారు. ఆ సమాచారం బయటకు వస్తే కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు చెబుతున్నదాని ప్రకారం.. మొదటిసారి సియా కేతన్‌ను లోయలోకి తోసినా అతడు చెట్టుపొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే.. కేతన్ కు అనుమానం రాకుండా తనకు పాము కనిపించడంతోనే అలా తోసేశానని చెబుతూ అతడిని కౌగిలించుకుని ఏడుస్తూ.. అచ్చం సినిమాలోలాగే కవర్ చేసింది. తర్వాత మరోసారి కోటకు రావాలని కేతన్‌ను ఒప్పించి, ఈసారి చేతన్‌ను కూడా అక్కడికి పిలిపించిందని, ఇద్దరూ కలిసి వెనుక నుంచి తోసేయడంతో కేతన్ లోయలో పడి మరణించినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ ప్రణాళిక కూడా విఫలమైతే అమలు చేయడానికి మరో ప్రత్యామ్నాయ వ్యూహాంగా ‘ప్లాన్-సీ’ కూడా సిద్ధం చేసుకున్నట్లు విచారణలో తేలింది. అదేవిధంగా, కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. జూన్ 6న ప్రి వెడ్డింగ్ షూటింగ్ కోసం కేతన్, సియా బాలి వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ పర్యటన రద్దైంది. కేతన్ పాస్ పోర్టు కనిపించకపోవడమే ఇందుకు కారణం. తాజాగా పాస్‌పోర్టు అదృశ్యంపై కేతన్, సియా ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ పలు ఆరోపణలు చేశాడు. బాలి పర్యటన కోసం ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సియాతో అతని సోదరుడు కారులో ఎక్కారని, అనంతరం రావెట్ ప్రాంతానికి చేరుకోగా కేతన్ కారు ఎక్కాడని డ్రైవర్ తెలిపాడు. కొంతసేపటికి టీ తాగడానికి కారును ఆపమని సియా కోరడం, అనంతరం కారు బూట్‌ను ఓపెన్ చేయమని డ్రైవర్‌ను అడిగిందని తెలుస్తోంది. ఆ సమయంలో సియా తన పర్సులోంచి ఏదో తీసినట్లు గమనించానని.. తర్వాత వారిని ఎయిర్‌పోర్టులో దించేసినట్లు డ్రైవర్ తెలిపాడు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి కారు బయలుదేరాక రెండు నిమిషాలకు తనకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని డ్రైవర్ తెలిపాడు. కారులో చిన్న బ్యాగ్ మరిచిపోయినట్లు కేతన్ బృందం అతడికి చెప్పింది. దీంతో వెనక్కి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ఆ బ్యాగును ఇచ్చి వెళ్లాడు. 500 మీటర్ల దూరం వెళ్లాక పాస్‌పోర్టు కనిపించడం లేదని అతడికి మళ్లీ ఫోన్ వచ్చిందని చెప్పాడు. కారులోనే ఆ పాస్‌పోర్టు పడిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. తన వాహనంలో లేదని చెప్పినా వినకుండా వీడియో కాల్‌లో చెక్‌చేశారన్నాడు. అంతటితో ఆగకుండా కారును విమానాశ్రయానికి రప్పించుకుని సాహిల్, కేతన్‌లు పరిశీలించారని డ్రైవర్ తెలిపాడు. అయితే, ఎంత వెతికినా పాస్‌పోర్టు కనిపించకపోవడంతో ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగారని తెలుస్తోంది. ఇక బాలి పర్యటన రద్దు కావడానికి ప్రధాన కారణమైన పాస్‌పోర్టు అదృశ్యంపై దర్యాప్తు బృందాలు విచారణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ చెప్పిన సమాధానాలు కీలకంగా మారే అవకాశం ఉంది. కేతన్, సియాలు బాలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు, అతని పాస్‌పోర్టును కావాలనే మాయం చేశారని.. ఇది అనుకోకుండా జరిగింది కాదని, అతని హత్య కుట్రకోణంలో భాగమని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పాస్‌పోర్టు కనిపించకుండా పోవడంపై కేతన్ తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. కారులో మొత్తం నలుగురు ఎయిర్‌పోర్టుకు వెళ్లారని,. కారు ఎక్కేముందు అందరూ తమ పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్‌లను సరిచూసుకున్నారని, వాటన్నింటిని ఒకే పర్సులో ఉంచారని తెలిపారు. కేవలం కేతన్ పాస్‌పోర్టు మాత్రమే మాయం అయిందని చెప్పాడు. ఇక మరోవైపు, పుణె రూరల్ పోలీసులు ఈ కేసును అన్ని కోణాలలోనూ విచారిస్తున్నారు. ఆరు బృందాలు ఏర్పాటు చేసి సియా గోయల్ తల్లిదండ్రులు, సోదరుడు సాహిల్‌ను విచారించారు. సాహిల్ విచారణలో చేతన్ చౌదరి తనకు తెలుసని, సోదరి ఒక క్రికెట్ మ్యాచ్‌లో అతనిని పరిచయం చేసినట్లు వెల్లడించాడు. చేతన్ చౌదరితో సియా గోయల్ పరిచయాన్ని, వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యాన్ని గురించి పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. గత ఏడాది దీపావళి పార్టీలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. చేతన్, సియా మధ్య జనవరి నుంచి 2,000 సార్లు దాదాపు 238 గంటల పాటు సంభాషణలు జరిగినట్లు కాల్ రికార్డులు చూపిస్తున్నాయి. నిందితులు డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేసులో కుట్ర కోణాన్ని రుజువు చేసేందుకు ఈ సాక్ష్యాలు కీలకం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, లోహ్‌గఢ్ కోట వద్ద లోయలోకి తోసి కేతన్‌ను హత్య చేయాలని సియాను ఆమె ప్రియుడు చేతన్ ప్రేరేపించాడని పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా రెస్క్యూ టీమ్ సభ్యుడు సునీల్ గైక్వాడ్ కీలక విషయాలను వెల్లడించాడు. లోహగఢ్ కోట వద్ద లోయలో లభ్యమైన కేతన్ మృతదేహంపై ఉన్న గాయాలు ఈ హత్యలోని క్రూరత్వాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. మృతుడి తలపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, అతని తలభాగం పూర్తిగా ఛిద్రమైందని సునీల్ గైక్వాడ్ మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా, అతని కాళ్లు, చేతులపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 10:30 గంటలకు సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్, సుమారు రెండు గంటల పాటు శ్రమించి దట్టమైన అడవి, నిటారుగా ఉన్న కొండల గుండా మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చిందని సమాచారం. మధ్యాహ్నం 1:30 గంటలకు మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి చేర్చడంతో ఈ ఆపరేషన్ ముగిసింది. ఈ దారుణ ఘటన స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. అయితే కేతన్ మృతదేహాన్ని వెలికితీసే సమయంలో అక్కడ ఉన్న వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురికాగా.. సియా మాత్రం ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ప్రశాంతంగా కనిపించిందని రెస్క్యూ టీమ్ తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటరుగా మహారాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొత్తంగా, ఈ కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పోలీసులు మరిన్ని వివరాలను బయటపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి మొబైల్స్ లో డిలీట్ చేసిన డేటా రికవర్ చేస్తే కేతన్ హత్యకు గల అసలు కారణాలు బయటకు వస్తాయని సమాచారం.ప్రస్తుతం పోలీసులు డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, మొబైల్ డేటా, సంఘటన స్థలంలో లభించిన సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అయితే, దర్యాప్తులో వెల్లడైన అంశాలు పోలీసుల ప్రాథమిక విచారణ ఆధారంగా ఉన్నాయని, తుది నిజాలు కోర్టు విచారణ అనంతరమే తేలనున్నాయని తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకలేస్తుందని చల్లబజ్జీలు తిన్నారు.. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 50 మంది..
హోంమంత్రి అనిత మంచి మనసు.. మహిళా ఎస్సైకి ఘనంగా సీమంతం
పడిపోతున్న పసిడి ధరలు.. భయంతో జనం ఏం చేస్తున్నారో చూడండి!
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్! మరో 2 రోజులు దంచికొట్టనున్న వానలు!
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.! ఆకాశం నుండి పాతాళానికి..రేపటి రేట్లు వింటే మైండ్ బ్లాక్!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

