మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, 119 నియోజకవర్గాల్లో ఏకకాలంలో కార్డులు పంపిణీ చేయనున్నారు. సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు అందనున్న ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్, లబ్ధిదారుల ఫొటో, ఈ-కేవైసీ వివరాలు ఉంటాయి. కార్డు పొందేందుకు ఈ-కేవైసీ పూర్తిచేసుకోవడం కీలకం.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం, అలాగే ఉన్న రేషన్ కార్డుల అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురును అందించింది. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవం, అంటే ఆగస్ట్ 15వ తేదీ వేదికగా తెలంగాణవ్యాప్తంగా సరికొత్త ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు అందరూ ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న కాగితపు రేషన్ కార్డులనో లేదా సాధారణ జిరాక్స్ ప్రతులను లామినేట్ చేసుకుని వాడుతున్న విషయాన్న అందరూ చూసే ఉంటాం. కానీ ఇకపై ఆ అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్‌సీ లేదా డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలోనే అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పీవీసీ లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులు మీ చేతికి రాబోతున్నాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు? ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు పంపిణీ చేస్తారు? మీ కార్డు పొందడానికి మీరు చేయాల్సిన పనులేంటి? ఈ కార్డుల వల్ల లభించే ప్రయోజనాలు ఏమిటి? అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం! ఈ చారిత్రాత్మక పథకానికి సంబంధించి పంపిణీ ముహూర్తం పూర్తి స్థాయిలో ఖరారైంది.ఆగస్టు 15న పంద్రాగస్టు వేడుకల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సిఎంతో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కాగానే.. అదే రోజు, అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉదయం పూట జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం 5:30 గంటలకు లోక్‌భవన్ లో సాంప్రదాయకంగా జరిగే ‘ఎట్ హోమ్’ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 15న మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల మధ్య ప్రతి నియోజకవర్గంలోనూ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ముగించేలా కచ్చితమైన సమయవేళలను ఖరారు చేశారు. ఈ విడతలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు ఈ సరికొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నారు. ఇందులో ప్రధానంగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేదా అంతకుముందు నుంచి ఉన్న ఆహార భద్రతా కార్డుదారులకు ప్రయోజనం కలగనుంది. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా ఆహార భద్రత కోసం ఎంపికై వారికి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. , ఆన్‌లైన్‌లో ఆమోదం పొంది ఫిజికల్ కార్డు అందని లబ్ధిదారులకు ఇది లాభమే. ఇప్పటివరకు కేవలం కాగితపు రసీదులతో గడిపిన ప్రతీ ఒక్కరికీ ఇది నిజంగా పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయబోతున్న స్మార్ట్ రేషన్ కార్డుల రూపురేఖలు, వాటి డిజైన్ మునుపటి కంటే పూర్తి భిన్నంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. పలు రకాల నమూనాలను పరిశీలించిన అనంతరం పౌరసరఫరాల శాఖ ఈ ప్రత్యేక డిజైన్‌ను ఆమోదించింది. మీ పర్స్ లేదా వ్యాలెట్‌లో సులభంగా పెట్టుకునేలా ఏటీఎమ్ డెబిట్ కార్డు లేదా పాన్ కార్డ్ పరిమాణంలో ఉంటుంది. పేపర్ కార్డులలాగా నీటిలో తడిసి పాడైపోవడం లేదా చిరిగిపోవడం వంటి సమస్యలు ఇక ఉండవు. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్‌ను అమర్చారు. డీలర్లు లేదా అధికారులు ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఆ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఈ-కేవైసీ స్థితి, ప్రతీ నెలా పొందే రేషన్ సరుకుల వివరాలు స్క్రీన్‌పై డిజిటల్‌గా ప్రత్యక్షమవుతాయి. లబ్ధిదారుల ఈ-కేవైసీ ప్రక్రియలో సేకరించిన ఫోటోల ఆధారంగా ఆధార్ కార్డుపై ఉన్న ఫోటోను ఈ స్మార్ట్ రేషన్ కార్డుకు నేరుగా బదిలీ చేసి ముద్రించారు.అత్యంత నాణ్యమైన లామినేటెడ్ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల ఈ కార్డులు ఏళ్ల తరబడి చెక్కుచెదరకుండా ఉంటాయి. ఆగస్టు 15న ఈ బృహత్తర పంపిణీ కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా జరగాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న లబ్ధిదారుల పూర్తి తుది జాబితాను సిద్ధం చేసి, పునఃపరిశీలన పూర్తి చేయాలి. ప్రతీ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో పౌరసరఫరాల శాఖ, జిల్లా పరిపాలనాధికారులు కలిసి పని చేయాలి. పంపిణీ కేంద్రాల వద్ద స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పండుగ వాతావరణంలో కార్డులను అందించాలి. కార్డుల ముద్రణ, సురక్షిత రవాణా, పంపిణీ కేంద్రాల వద్ద ప్రజలకు తాగునీరు, నీడ వంటి సౌకర్యాలతో పాటు డ్రైవింగ్, లైటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ కేవలం రేషన్ షాపుల నుంచి బియ్యం లేదా సరుకులు తీసుకోవడానికి మాత్రమే కాకుండా.. దీనివల్ల ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా పారదర్శకత పెరుగుతుంది, నకిలీ లేదా బోగస్ కార్డులకు అడ్డుకట్ట పడుతుంది. ఉచిత విద్యుత్, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అనేక సంక్షేమ పథకాల అర్హతకు రేషన్ కార్డ్ ప్రామాణికంగా పనిచేస్తుంది. డెబిట్ కార్డ్ మాదిరిగా జేబులో పట్టేలా ఉండడం వల్ల ఎక్కడికైనా సులభంగా గుర్తింపు కార్డుగా తీసుకెళ్లవచ్చు. ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR వంటి ప్రక్రియల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అధికారిక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది. మీకు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఎలాంటి అంతరాయం లేకుండా అందాలంటే మీ రేషన్ కార్డులోని సభ్యులందరికీ ఈ-కేవైసీ పూర్తయి ఉండటం అత్యంత ఆవశ్యకం. మీరు సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లి బయోమెట్రిక్ వేలిముద్రలు ఇచ్చి మీ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీ కుటుంబంలో చిన్న పిల్లలు లేదా వయోవృద్ధులు ఉంటే, అధికారుల మార్గదర్శకాల ప్రకారం వివరాలను అప్‌డేట్ చేసుకోండి. తుది లిస్టులో మీ పేరు ఉందో లేదో మీ పరిధిలోని ఆర్డీవో కార్యాలయం లేదా పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. ఆ తర్వాత ఏం చేశారో చూడండి!
అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తి చేస్తే ఉచితంగా పైలట్ శిక్షణ!
హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు
తండ్రిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూతుళ్లు.. తర్వాత ఏం చేసారంటే
తల్లి గర్భంలోనే సర్జరీ.. వైద్య చరిత్రలోనే అరుదైన అద్భుతం!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా..
చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే

