AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూళ్ళ రీఓపెనింగ్‌పై తమిళ సర్కార్ వెనుకంజ

తమిళనాడులో పాఠశాలల రీఓపెన్ అంశంపై మీమాంస మొదలైంది. నవంబర్ 16వ తేదీ నుంచి ఉన్నత తరగతులకు పాఠశాలలు తిరిగి తెరవాలని ప్రభుత్వం తొలుత భావించింది. కానీ తాజాగా ఈ విషయంలో పునరాలోచన చేస్తోంది. ప్రధాన కారణాలు...

స్కూళ్ళ రీఓపెనింగ్‌పై తమిళ సర్కార్ వెనుకంజ
Rajesh Sharma
|

Updated on: Nov 04, 2020 | 6:32 PM

Share

Tamil Government back step on schools re-opening: పొరుగునే వున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులను గమనించిన తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు పున: ప్రారంభించే విషయంలో పునరాలోచనలో పడింది. నవంబర్ 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరవాలని భావించినా.. ప్రస్తుతం ఈ విషయంలో వెనక్కి తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు సెకెండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభణ ముందుందన్న హెచ్చరికలు జారీ అవుతున్న తరుణంలో పాఠశాలలు తెరిచి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం మంచిది కాదని ముఖ్యమంత్రి ఫళని స్వామి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ఎక్కువ స్థాయిలో కరోనా బారిన పడిన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఇప్పుడంటే పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏపీ రెండో స్థానంలో కనిపిస్తుందిగానీ.. కరోనా ప్రబలిన తొలి మూడు, నాలుగు నెలల తమిళనాట భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువేమీ కాదు. రోజూ 3 నుంచి 4 వేల దాకా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

కేంద్ర అన్ లాక్‌డౌన్ 5.0లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు తెరుచుకునే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలను కోరిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15వ తేదీ తర్వాత పాఠశాలలు అవసరమైతే, ప్రమాదం లేదనుకుంటే తెరుచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు లభించింది. ఈ క్రమంలో నవంబర్ 16వ తేదీ నుంచి పాఠశాలలను పున: ప్రారంభించాలని ఫళనిస్వామి ప్రభుత్వం భావించింది. దానికి అవసరమైన చర్యలకు కూడా ఉపక్రమించింది.

కానీ తాజా పరిణామాలు ఆందోళనకరంగా మారడంతో పాఠశాలలు తెరిచే విషయంలో తమిళ సర్కార్ పునరాలోచన చేస్తోంది. తాజాగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడం, సెకండ్ వేవ్ కూడా వస్తుందంటూ డాక్టర్లు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వుండడంతో ఫళనిస్వామి పాఠశాలలు తెరిచే విషయాన్ని మరికొంత కాలం వాయిదా వేయాలని భావిస్తున్నారు. దానికి తోడు పొరుగునే వున్న ఏపీలో పాఠశాలలు తెరిచిన రెండ్రోజుల్లోనే మూడు జిల్లాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడిన వార్తలు కూడా తమిళ ప్రభుత్వాధినేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. మరి కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోబోతున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలకు ఏదైనా జరిగితే అది తమ ప్రభుత్వానికి మచ్చగా మిగిలిపోతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు పాఠశాలలు తెరవొద్దంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో మంత్రులతో చర్చించి, పాఠశాలల రీఓపెనింగ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తోంది.

అయితే విపక్షాల ఒత్తిళ్ళను తలొగ్గిన ముద్ర పడొద్దని భావిస్తున్న ముఖ్యమంత్రి ఫళనిస్వామి… విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. నవంబర్ 9వ తేదీ లోగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలను తిరిగి తెరిచే విషయంలో అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలుపవచ్చని తమిళనాడు విద్యాశాఖ ప్రకటించింది.

ALSO READ: ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్.. కేసుల్లో మరింత తీవ్రత

ALSO READ: సిట్టింగ్ లీడర్ల కేసులపై వున్న కేసులకే తొలి ప్రాధాన్యం

ALSO READ: వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం

ALSO READ: సాగర తీరానికి కొత్త సొబగులు..ఇక రాత్రంతా..!

ALSO READ: విజయవంతంగా ‘పినాక’ ప్రయోగం

ALSO READ: రెండు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు