AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే..

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ అలవాటుకు బానిసలుగా మారుతున్నారు. సిగరెట్‌లోని నికోటిన్ మెదడులో డోపమైన్‌ను విడుదల చేసి తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే దీర్ఘకాలంలో ఇది శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ధూమపానం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది..

సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే..
Ways To Stop Smoking
Srilakshmi C
|

Updated on: Jul 08, 2026 | 9:39 PM

Share

ఒకసారి ధూమపానానికి అలవాటుపడితే దానిని మానేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ సరైన ప్రణాళిక, దృఢ సంకల్పం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యసనాన్ని అధిగమించడం సాధ్యమే. ధూమపానం మానేయడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఇవి.

దృఢ సంకల్పమే మొదటి అడుగు

ధూమపానం మానేయాలంటే ముందుగా మీలో బలమైన నిర్ణయం ఉండాలి. నేను తప్పకుండా మానేస్తాను.. అనే నమ్మకం ఉంటేనే విజయవంతంగా ఈ అలవాటును విడిచిపెట్టగలుగుతారు. మీ ఆరోగ్యం, కుటుంబం, భవిష్యత్తు కోసం ధూమపానం మానేయాలని ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.

ధూమపానానికి ప్రేరేపించే పరిస్థితులకు గుడ్‌బై

చాలామందికి టీ, కాఫీ తాగేటప్పుడు లేదా మద్యం సేవించే సమయంలో సిగరెట్ తాగాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులను గుర్తించి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. ఒక్కసారిగా మానేయడం కష్టమైతే, రోజుకు తాగే సిగరెట్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ ముందుకు సాగాలి.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు

సిగరెట్ తాగాలనే కోరిక కలిగినప్పుడు యాలకులు, సోంపు వంటి వాటిని నమలవచ్చు. అలాగే చక్కెర లేని చూయింగ్ గమ్, గట్టి మిఠాయిలు లేదా ఎండిన క్యారెట్ ముక్కలు తీసుకోవడం ద్వారా ఆ కోరికను నియంత్రించవచ్చు. బాదం, వాల్‌నట్స్ వంటి గింజలు కూడా మంచి ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తాయి.

వ్యాయామం – యోగా

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచుతాయి. నడక, జాగింగ్, సైక్లింగ్, యోగా, ధ్యానం వంటి కార్యకలాపాలు ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడతాయి.

కుటుంబం, స్నేహితుల మద్దతు పొందాలి

ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. వారి ప్రోత్సాహం, మద్దతు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎంతో సహాయపడుతుంది. కష్టమైన సమయంలో వారు మీకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించగలరు.

కొత్త అభిరుచులను అలవర్చుకోవాలి

ధూమపానం గురించి ఆలోచించకుండా ఉండేందుకు కొత్త హాబీలను అలవర్చుకోవడం మంచిది. చిత్రలేఖనం, సంగీతం, పుస్తకాలు చదవడం, తోటపని, చేతిపనులు చేయడం వంటి కార్యకలాపాలు మనసును ఇతర విషయాలపై కేంద్రీకరించడానికి సహాయపడతాయి. దీంతో ధూమపానం చేయాలనే ఆలోచనలు క్రమంగా తగ్గిపోతాయి.

ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ధూమపానం మానేసిన కొద్ది గంటల్లోనే శరీరంలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి. రక్తపోటు, గుండె వేగం సాధారణ స్థితికి చేరుకోవడం మొదలవుతుంది. కొద్ది వారాల్లో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ధూమపానం మానేయడం ఒకరోజులో జరిగే ప్రక్రియ కాదు. అయితే ప్రతి చిన్న ప్రయత్నం మిమ్మల్ని ఆరోగ్యకరమైన జీవితానికి దగ్గర చేస్తుంది. దృఢ సంకల్పం, సరైన అలవాట్లు, కుటుంబ సభ్యుల మద్దతుతో ధూమపాన వ్యసనాన్ని అధిగమించడం పూర్తిగా సాధ్యమే. ఈరోజే మొదటి అడుగు వేయండి.. మీ ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం.

Follow Us