శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దీపారాధన చేయడం, పసుపు కుంకుమలు, తాంబూలం సమర్పించడం వంటి సంప్రదాయాలను పాటిస్తారు. అయితే శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది.. ఈ మాసం వ్రతాలకు, నియమాలకు, పూజలకు ప్రాధాన్యతనిస్తుంది. శ్రావణ మాసంలో సోమవారం శివ వ్రతానికి, మంగళవారం మంగళగౌరీ వ్రతానికి, శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి, శనివారం వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి పూజలకు ప్రసిద్ధి చెందింది. ధర్మసింధువు, భవిష్యోత్తర పురాణం, అగ్ని పురాణం, వ్రత చూడామణి వంటి గ్రంథాలు ఈ వ్రతాల ప్రాముఖ్యతను సమగ్రంగా వివరిస్తాయి.. అయితే, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున.. అంటే ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు అష్టలక్ష్మీ స్వరూపిణి అయిన వరలక్ష్మీదేవిని పూజించి, కుటుంబ సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ వ్రతం, పూజల విషయంలో కొందరికి సందేహాలుంటాయి.. ఎలా చేయాలి.. పాంటించాల్సిన నియామాలు ఏంటి ..? అనే వివరాలను తెలుసుకుందాం..
శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..
శ్రావణ శుక్రవారం పాటించాల్సిన శుభ నియమాలు:
పరిశుభ్రత – ప్రశాంతత: శుక్రవారం నాడు ఇంటిల్లిపాది సూర్యోదయం కంటే ముందే లేచి స్నానాదులు పూర్తిచేసుకుని, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి వాకిలిని శుభ్రంగా ఉంచుకుని, గడపపై బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, నవ్వుతూ ఉండాలి.
దీపారాధన: దేవతార్చన జరిగే చోట దీపాలు వెలిగించి, దైవారాధన చేయాలి.
పసుపు కుంకుమల వితరణ: పసుపు, కుంకుమలు ఇతరులకు ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా కుంకుమ భరిణెల్లో లేదా పళ్ళెంలో పెట్టి ఇవ్వడం సంప్రదాయం.
తాంబూల సమర్పణ: తమలపాకులు, పండు (గింజలున్న పండు, ఉదాహరణకు జామపండు లేదా బత్తాయి), ఖర్జూరం కలిపి తాంబూలం సమర్పించాలి. తమలపాకు తొడిమ తమ వైపు, చివర ఎదుటివారి వైపు ఉండేలా అందించడం నాగవల్లి సంప్రదాయం. గింజలున్న పండు సంతాన సాఫల్యానికి ప్రతీకగా భావిస్తారు.
ఐదు అలంకార నియమాలు: శ్రావణ శుక్రవారాలలో మహిళలు తప్పనిసరిగా పాటించాల్సిన ఐదు అలంకార నియమాలు ఉన్నాయి:
- కాలికి పసుపు: ఇది కేవలం అందం కోసమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిదని నమ్ముతారు.
- కంటికి కాటుక: కళ్ళకు చలువనిచ్చి దృష్టి దోషాలను నివారిస్తుందని భావిస్తారు.
- నుదుటన కుంకుమ బొట్టు: ఇది ఆజ్ఞా చక్రంతో ముడిపడి, ఏకాగ్రతను పెంచుతుందని ఆధ్యాత్మికంగా చెబుతారు.
- నెత్తిలో పువ్వులు: సువాసన, సానుకూల శక్తికి ప్రతీక.
- చేతికి గాజులు (ముఖ్యంగా మట్టి గాజులు): దేహంలో గుండె నుంచి చేతుల వరకు ప్రసరించే వేగస్ నరంను మట్టి గాజులు రక్షిస్తాయి. పూర్వకాలంలో నాడి చూసే విధానంలో దీని ప్రాముఖ్యత స్పష్టమవుతుంది.
శ్రావణ శుక్రవారం నాడు చేయకూడని పనులు:
ఉసిరిక పచ్చడి: శ్రావణ మాసంలోని శుక్రవారాలలో ఉసిరిక పచ్చడి తినకూడదని కొందరు పాటిస్తారు.
లేదు” అని చెప్పకూడదు: ఈ పవిత్రమైన రోజున “లేదు” అనే పదం నోటి నుండి రాకుండా చూసుకోవాలి. ఇది లక్ష్మీ కటాక్షానికి ఆటంకం అని భావిస్తారు. “నిండు కుండ” అని మాట్లాడవచ్చు.
కొన్ని వస్తువులు కొనకూడదనే అభిప్రాయాలు: కొందరు శుక్రవారం నాడు ఉప్పు, నూనె వంటివి ఖరీదు చేయకూడదని చెబుతారు. అయితే, ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, శాస్త్రాలలో దీనికి స్పష్టమైన ఆధారాలు లేవని నిపుణులు పేర్కొంటారు.
ఆధ్యాత్మిక – శాస్త్రీయ విశేషాలు:
శ్రావణ శుక్రవారం నాడు మెడకు గంధం అలదుకోవడం విశుద్ధ చక్రానికి రక్షణ కల్పిస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంధులకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుందని, ఊబకాయంతో బాధపడేవారు గంధం ధరిస్తే ప్రయోజనం ఉంటుందని సనాతన ధర్మం చెబుతుంది. ఈ ఆచారాలు కేవలం సంప్రదాయాలు మాత్రమే కాకుండా, ఆరోగ్యం – మానసిక ప్రశాంతతకు తోడ్పడే శాస్త్రీయ నేపథ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం ద్వారా మహిళలు సంతోషకరమైన, సంపద్వంతమైన జీవితాన్ని పొందవచ్చని ప్రగాఢ విశ్వాసం..
