AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి

15 ఏళ్ల జైలు జీవితం తర్వాత మాజీ మావోయిస్టు కీలక నేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ విడుదలయ్యారు. 68 కేసులు ఎదుర్కొన్న ఆయనను ఒడిశాలోని పర్లాఖెముండి కోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో జార్పడ జైలు నుంచి విముక్తి లభించింది. తల్లి దున్న కాములమ్మ సుదీర్ఘ న్యాయపోరాటం కూడా ఆయన విడుదలకు కీలకంగా నిలిచింది.

15 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఇంటికి.. తల్లి న్యాయపోరాటంతో మాజీ మావోయిస్టు నేతకు విముక్తి
Dunna Kesava Rao
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2026 | 1:09 PM

Share

68 కేసులు.. రూ.10 లక్షల రివార్డు.. 15 ఏళ్ల జైలు జీవితం.. చివరకు కోర్టు తీర్పుతో విముక్తి. మాజీ మావోయిస్టు కీలక నేత దున్న కేశవరావు అలియాస్‌ ఆజాద్‌ జీవితం అనేక మలుపులు తిరిగింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆయన స్వగ్రామానికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కుమారుడిని చూసిన తల్లి దున్న కాములమ్మ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. అనంతరం తన కుమారుడికి స్వీట్లు తినిపించి ఆప్యాయంగా స్వాగతించారు.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన కేశవరావు చిన్నతనంలోనే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. 1990 ప్రాంతంలో పీపుల్స్‌ వార్‌ దళంలో చేరిన ఆయన.. ఆ తర్వాత ఆజాద్‌ పేరుతో కీలక నేతగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఆయనపై మొత్తం 68 కేసులు నమోదయ్యాయి. ఆయన ఆచూకీ కోసం పోలీసులు రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.

సుమారు 25 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపిన కేశవరావు 2011లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అప్పటి డీజీపీ అరవిందరావు సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న ఆయనకు అక్కడి జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. లొంగిపోయిన పది రోజులకే ఒడిశాలో నమోదైన కేసుల విచారణ పేరుతో అక్కడి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భువనేశ్వర్‌లోని జార్పడ జైలుకు తరలించారు.

తనపై నమోదైన కేసుల విషయంలో కేశవరావు న్యాయపోరాటం ప్రారంభించారు. పలు సంఘాల సహకారంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తన కుమారుడికి అన్యాయం జరుగుతోందంటూ ఆయన తల్లి కాములమ్మ కూడా ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేశారు. కుమారుడి విడుదల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. కేశవరావుపై ఏపీ, తెలంగాణలో నమోదైన కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. జైలు జీవితంలోనే కేశవరావు తన కేసుల పరిష్కారం కోసం నిరాహార దీక్ష కూడా చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఒడిశాలోని పర్లాఖెముండి కోర్టులో ఆయనపై నమోదైన కేసుల విచారణ పూర్తయింది. తగిన ఆధారాలు లేకపోవడంతో కేశవరావును కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో జార్పడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. విడుదల అనంతరం నల్లబొడ్లూరుకు చేరుకున్న కేశవరావుకు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ స్వాగతం పలికారు. సుదీర్ఘ కాలం తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కళ్లారా చూసిన ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. తల్లి కాములమ్మ తన కుమారుడికి స్వీట్లు తినిపించి ప్రేమను చాటుకున్నారు.

ఒకప్పుడు అజ్ఞాతంలో జీవించిన మావోయిస్టు నేతగా, ఆపై నిందితుడిగా, చివరకు సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నిర్దోషిగా బయటకొచ్చిన కేశవరావు.. 15 ఏళ్ల జైలు జీవితానికి ముగింపు పలికి మళ్లీ కుటుంబం మధ్యకు చేరుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us