‘సేవయే దైవారాధన’.. ద్వారకా తిరుమలలో హృదయాలను హత్తుకున్న ఘటన.. వీడియో చూస్తే కంటతడే..
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలోని అన్నదాన సముదాయంలో మానవత్వాన్ని చాటే ఘటన చోటుచేసుకుంది. రెండు చేతులు కోల్పోయిన ఓ వృద్ధ భక్తుడు అన్నప్రసాదం తినలేని పరిస్థితిని గమనించిన మహిళా సిబ్బంది స్వయంగా ప్రేమగా అన్నం తినిపించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సిబ్బంది సేవాభావాన్ని భక్తులు ప్రశంసిస్తున్నారు.

ఏలూరు : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మనుషుల్లోని దైవత్వాన్ని చాటిచెప్పే ఒక సంఘటన చోటుచేసుకుంది. భక్తులకు కడుపు నిండా అన్నప్రసాదం పెట్టే ఆ తిరుమల క్షేత్రంలో, సిబ్బంది చూపిన మానవత్వం ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించడంతో పాటు ప్రశంసలు అందుకునేలా చేసింది. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఎంతో మంది భక్తులు స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక వృద్ధ భక్తుడు అన్నప్రసాదం స్వీకరించేందుకు అన్నదాన సముదాయానికి విచ్చేశారు. అయితే ఆయన రెండు చేతులు కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చేతులు లేకపోవడంతో తనంతట తానుగా అన్నం తినలేని దుస్థితిలో ఆయన ఉండిపోయారు.
ఆప్యాయంగా లాలించి.. కడుపు నింపిన సిబ్బంది
అన్నదాన పంపిణీ శాలలో జరుగుతున్న ఈ దృశ్యాన్ని అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది గమనించారు. క్షణం కూడా ఆలోచించకుండా, ఆ భక్తుడి దీనస్థితిని అర్థం చేసుకున్న ఒక మహిళా అన్నదాన సిబ్బంది ముందుకు వచ్చారు. అమ్మ ఒడిలో కూర్చున్న పసిబిడ్డలా ఆ వృద్ధ భక్తుడికి ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో స్వయంగా అన్నప్రసాదం తినిపించారు. తోటి మనిషి ఆకలి తీర్చడంలో దేవుడిని చూసే నిజమైన భక్తికి ఈ ఘట్టం నిదర్శనంగా నిలిచింది. ఈ మానవీయ కోణానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. “సేవయే నిజమైన దైవారాధన” అన్న నానుడిని ద్వారకా తిరుమల అన్నదాన సిబ్బంది నిజం చేశారని భక్తులు కొనియాడుతున్నారు.
వీడియో చూడండి..
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో శ్రీవారి దేవస్థాన సిబ్బంది చూపిన చొరవ అభినందనీయం అని, ఇది ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసిస్తున్నారు. స్వామి వారి సన్నిధిలో జరిగిన ఈ ఘటన మానవత్వం ఇంకా బతికే ఉందనే భరోసాను ఇస్తోంది. భక్తుడి పరిస్థితి గమనించి స్పందించిన సిబ్బందిని ఆలయ ఈ ఓ వెండ్ర త్రినాధరావు ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
