రేపటి నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత.?
సాయిబాబా జన్మస్థలంగా పాథ్రీని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తామంటూ గతవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన ప్రకటనపై షిర్డీవాసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 19 నుంచి షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. అయితే సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆలయాన్ని మూసివేయమని.. అంతేకాకుండా భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది. అయితే షిరిడీలోని హోటల్స్, ప్రైవేట్ రవాణా మాత్రం నిరవధిక బంద్‌ను […]

సాయిబాబా జన్మస్థలంగా పాథ్రీని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తామంటూ గతవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే చేసిన ప్రకటనపై షిర్డీవాసులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 19 నుంచి షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసివేస్తామని హెచ్చరించారు. అయితే సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఆలయాన్ని మూసివేయమని.. అంతేకాకుండా భక్తులు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని స్పష్టం చేసింది.
అయితే షిరిడీలోని హోటల్స్, ప్రైవేట్ రవాణా మాత్రం నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై ఇవాళ స్థానికులతో చర్చించనున్న ట్రస్ట్ తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. అంతేకాకుండా రేపు షిర్డీ బంద్‌కు గ్రామస్తులు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే పర్భణీ జిల్లాలోని పాథ్రీ అనే ఊరిలో సాయిబాబా జన్మించారన్న ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే ఆయన 16 ఏళ్ళ వయసులోనే షిర్డీకి వచ్చారని.. అక్కడ ఒక వేపచెట్టు కింద కనిపించారని భక్తులు అంటుంటారు. అంతేకాకుండా సాయిబాబా కొలువుతీరిన ప్రదేశంగా షిర్డీ ఎంతో ప్రాముఖ్యం పొందింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు.
అలాంటిది ఇప్పుడు ఈ చోటును కాదని పాథ్రీని పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం ఏంటని ట్రస్ట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. షిర్డీలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని పర్భణీకి తరలించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే షిర్డీకి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నిర్ణయానికి వ్యతిరేకంగానే రేపటి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నామని.. జరగాల్సిన కార్యక్రమాలను కూడా నిలిపేస్తున్నట్లు ట్రస్ట్ అధికారులు ప్రకటించారు. ఇకపోతే షిర్డీకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటామని వారు చెబుతున్నా.. ఈ అనూహ్య పరిణామంతో షిర్డీకి వెళ్లాలనుకున్న భక్తులు.. ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయారు.




