రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా అనేక ప్రత్యేక రైళ్లు..
దక్షిణ మధ్య రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు...
దక్షిణ మధ్య రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కోవిడ్ లాక్‌డౌన్ అనంతరం ఇప్పుడు మళ్లీ రైల్వే ట్రాఫిక్ పెరుగుతోంది.
అటు రైళ్లలో ప్రయాణీకుల రద్దీ కూడా ఎక్కువవుతోంది. పండుగ సీజన్‌లో మరి కాస్త ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీ పెరగడంతో వచ్చే వారం నుంచి రైల్వే శాఖ మూడు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ మూడు రైళ్లను విజయవాడ మీదుగా నడపడానికి రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 9 నుంచి మచిలీపట్నం – యశ్వంతపుర్ ప్రత్యేక రైలు నెంబర్ 07211 సోమ, బుధ, శుక్రవారాల్లో నడవనుంది. మచిలీపట్నంలో మధ్యాహ్నం 3.50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఇదే రైలు 07212 నెంబర్‌తో యశ్వంత్ పూర్ నుంచి మంగళ, గురు, శని వారాల్లో బయలు దేరుతుంది.
ఇక మరో రైలు కాకినాడ భావనగర్ టెర్మినస్ ప్రత్యేక రైలు నెంబర్ 07204 డిసెంబర్ 10 నుంచి కాకినాడలో ఉదయం 5.15 నిమిషాలకు బయలు దేరుతుంది. ఇదే రైలు 07203 నెంబర్‌తో ప్రతి శనివారం ఉదయం 4.25 నిమిషాలకు భావనగర్ టెర్మినస్ నుంచి బయలుదేరుతుంది.
మరో వైపు ఇదే కాకినాడ పోర్టు స్టేషన్ నుంచి లోకమాన్య తిలక్ ప్రత్యేక రైలు 07221 నెంబర్‌తో డిసెంబర్ 9 నుంచి బుధ, శనివారాల్లో ఉదయం 9 గంటలకు బయలు దేరుతుంది. అటు నుంచి అంటే లోకమాన్య తిలక్ నుంచి 07222 నెంబర్ తో గురు, ఆదివారాల్లో బయలు దేరుతుంది.
రైలు నెంబర్ 07205 షిర్డీ-కాకినాడ మధ్య రైలు నడుస్తుంది. డిసెంబర్ 6 నుంచి ఈ రైలు ప్రతీ ఆదివారం, మంగళవారం, గురువారం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 5.20 గంటలకు రైలు సాయినగర్ షిర్డీ రైల్వే స్టేషన్‌లో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 7.45 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.