అమిత్‌షాతో ఆర్టీసీ నేతల భేటీ హంబగ్గేనా ? అసలేం జరిగిందంటే ?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నెల రోజులు దాటేసింది. కెసీఆర్ ప్రభుత్వం కార్మికులు జాబ్‌లో చేరేందుకు విధించిన గడువు మంగళవారం రాత్రితో ముగుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కినా ఫలితం పెద్దగా లేదు. ఈక్రమంలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఒత్తిడి తేవాలన్న యోచనలో వుంది ఆర్టీసీ జెఎసీ అని కథనాలొచ్చాయి. ఈ కథనాలొచ్చి కూడా వారం దాటింది. కేంద్రం జోక్యం చేసుకుంటుందని, గవర్నర్ తమిళిసై నుంచి నివేదిక తెప్పించుకున్నారని జోరుగా వార్తలు రాశాయి కొన్ని ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు. […]

అమిత్‌షాతో ఆర్టీసీ నేతల భేటీ హంబగ్గేనా ? అసలేం జరిగిందంటే ?
Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Nov 05, 2019 | 3:36 PM

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నెల రోజులు దాటేసింది. కెసీఆర్ ప్రభుత్వం కార్మికులు జాబ్‌లో చేరేందుకు విధించిన గడువు మంగళవారం రాత్రితో ముగుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కినా ఫలితం పెద్దగా లేదు. ఈక్రమంలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఒత్తిడి తేవాలన్న యోచనలో వుంది ఆర్టీసీ జెఎసీ అని కథనాలొచ్చాయి.
ఈ కథనాలొచ్చి కూడా వారం దాటింది. కేంద్రం జోక్యం చేసుకుంటుందని, గవర్నర్ తమిళిసై నుంచి నివేదిక తెప్పించుకున్నారని జోరుగా వార్తలు రాశాయి కొన్ని ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు. నవంబర్ 4,5 తేదీలలో ఆర్టీసీ జెఎసీ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కలుస్తారని.. ఆ తర్వాత ఇక ఆర్టీసీ సమ్మె విషయంలో కేంద్రం డైరెక్టుగా రంగంలోకి దిగుతుందని తెగ కథనాలొచ్చాయి. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా వున్నట్లు సమాచారం.
అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరి ఆరు రోజలు అవుతున్నా జెఎసీ నేతలకు ఎలాంటి సమాచారం లేదని తాజాగా తెలుస్తోంది. అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యతలను తీసుకున్న తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఇప్పుడు ఈ విషయంపైనే మాట్లాడడం లేదని తెలుస్తోంది. మరో తెలంగాణ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్ళారు. ఇక అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇప్పించేదెవరు అన్నదే ఇప్పుడు ఆర్టీసీ జెఎసీ ముందున్న సవాల్ అని తెలుస్తోంది.
దానికి తోడు.. కేంద్రం కొంత కాలం క్రితం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగానే ఆర్టీసీలోకి ప్రైవేటు భాగస్తులను కెసీఆర్ సర్కార్ తీసుకు వస్తుందని.. ఇక కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు దీనిపై ఏం మాట్లాడతారని కొందరు అంటున్నారు. అందుకే అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారు.
గవర్నర్ నుంచి నివేదిక తెప్పించుకున్న అమిత్‌షా.. ఆర్టీసీ సమ్మె విషయంలో సర్కార్ వైఖరికి భిన్నంగా చెప్పేదేమీ లేదన్న భావనతోనే జెఎసీని దూరం పెట్టారని ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. సో.. అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ ఇప్పించేదెవరన్నది ఇప్పుడు జెఎసీ లీడర్లకు పెద్ద ప్రశ్నగా మారినట్లు తెలుస్తోంది. సో.. కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ కొందరు రాస్తున్న కథనాల్లో వాస్తవమెంతన్నది ఇప్పుడు తేలాల్సి వుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu