ఎర్రకోట వద్ద ఘర్షణల కేసు, డచ్ దేశీయునితో సహా మరొకరి అరెస్ట్, మరికొందరికోసం గాలింపు
ఢిల్లీ ఎర్రకోట వద్ద గత జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున జరిగిన ఘర్షణల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆ రోజున వందలాది రైతులు తమను చెదరగొట్టేందుకు యత్నిస్తున్న పోలీసులపైకి పొడవాటి కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు..
ఢిల్లీ ఎర్రకోట వద్ద గత జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం రోజున జరిగిన ఘర్షణల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆ రోజున వందలాది రైతులు తమను చెదరగొట్టేందుకు యత్నిస్తున్న పోలీసులపైకి పొడవాటి కత్తులు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు.. ఆ దాడుల్లో అనేకమంది పోలీసులు గాయపడ్డారు.వారిపై ఎటాక్ చేసి పారిపోయిన వారికోసం ఖాకీలు ఇప్పటికీ గాలిస్తున్నారు. కొంతమందిని అరెస్టు చేశారు. కాగా తాజాగా వీరు అరెస్టు చేసినవారిలో ఓ డచ్ దేశీయుడు కూడా ఉన్నాడు. అలాగే సదా అల్లర్లను రెచ్ఛగొట్టి పోలీసులకు చిక్కకుండా పారిపోయే మరొకరిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. మనీందర్ జిత్ సింగ్ అనే వ్యక్తి డచ్ దేశీయుడని, కానీ బర్మింగ్ హాం లో స్థిర పడ్డాడని, ఇతడు నకిలీ పాస్ పోర్టు. ఇతర డాక్యుమెంట్లతో తన స్వదేశానికి పారిపోతూ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి కూడా నాడు తమపై దాడికి దిగడం పోలీసులను ఆశ్చర్యపరుస్తోంది.ఇతడు ఓ గొడ్డలితో ఆ రోజున ఎర్రకోట వద్ద తిరిగిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో కనబడిందంటున్నారు. ఫోర్జరీ చేసిన ట్రావెల్ డాక్యుమెంట్లతో ఇతగాడు ఢిల్లీ నుంచి నేపాల్ వెళ్లే విమానం ఎక్కబోతూ పట్టుబడ్డాడు. అసలు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలతో ఇతనికి సంబంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఖేమ్ ప్రీత్ సింగ్ అనే మరొకరిని కూడా ఖాకీలు అరెస్టు చేశారు. ఇతని నుంచి ఓ గొడ్డలి వంటి సాధనాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. నిరసనకారులను రెచ్ఛగొట్టి, వారిని పోలీసులపైకి ఉసి గొలిపేలా ఇతగాడు ఆ రోజున పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగాడని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఇద్దరి అరెస్టుతో ఇప్పటివరకు ఈ అల్లర్ల కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసినవారి సంఖ్య 14 కి పెరిగింది. ఈ కేసులో ఇంకా చాలామంది నిందితులను తాము అరెస్టు చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Padmasana Pose : అందరికీ తెలిసిన ఆసనం పద్మాసనం.. ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏమిటో తెలుసా..!