AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengal Elections 2021: దీదీ దూకుడును దాదా అడ్డుకునేనా..? హీట్ పెంచిన గంగూలీ పొలిటికల్ ఎంట్రీ వ్యాఖ్యలు. !

పశ్చిమ బెంగాల్ పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. దాదా వర్సెస్‌ దీదీ అన్నట్లు సాగుతున్నాయి. ఇప్పుడు బెంగాల్‌ వ్యాప్తంగా ఇదే టాఫిక్.

Bengal Elections 2021: దీదీ దూకుడును దాదా అడ్డుకునేనా..? హీట్ పెంచిన గంగూలీ పొలిటికల్ ఎంట్రీ వ్యాఖ్యలు. !
Balaraju Goud
|

Updated on: Mar 10, 2021 | 11:36 AM

Share

sourav ganguly political entry : పశ్చిమ బెంగాల్ పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కాయి. దాదా వర్సెస్‌ దీదీ అన్నట్లు సాగుతున్నాయి. ఇప్పుడు బెంగాల్‌ వ్యాప్తంగా ఇదే టాఫిక్. క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన గంగూలీ రాజకీయాల్లోనూ రాణిస్తారా..? బీసీసీఐ అధినేతగా మెప్పు పొందిన సౌరవ్‌ పాలిటిక్స్‌లోనూ చక్రం తిప్పగలడా? అన్న చర్చ సాగుతోంది. బెంగాల్ దీదీ మమతకు పోటీగా గంగూలీ దిగుతున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్టు అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఈ ఏడాది జనవరిలో అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు రెండు ఆంజియోప్లాస్ట్‌ సర్జరీలు చేశారు వైద్యులు. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇక దాదా భవిష్యత్‌ ప్రణాళికలు ఏంటనే దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదా రాజకీయ రంగం ప్రవేశం గురించి చర్చ నడుస్తోంది.

భారత క్రికెట్‌ దశాదిశను మార్చిన వ్యక్తిగా సౌరవ్‌కు ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. అప్పటిదాకా మూస ధోరణిలో సాగుతున్న టీమిండియాకు దూకుడు నేర్పించిన వ్యక్తి గంగూలీ. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత జట్టును ముందుండి నడిపించిన ఘనత గంగూలీది. గంగూలీ వచ్చాకే భారత క్రికెట్‌కు మంచి రోజులొచ్చాయంటుంటారు విశ్లేషకులు. సౌరవ్‌ రాక టీమిండియాకు పూర్వవైభవం తెచ్చింది. తాను చేపట్టిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిన గంగూలీ ప్రస్తుతం రాజకీయ ఆరంగ్రేటం చేస్తారన్న వార్తలు మార్మోగుతున్నాయి. కెప్టెన్‌గా టీమిండియాను నిలబెట్టిన గంగూలీ.. కొన్నాళ్లు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్యంగా బీసీసీఐ పగ్గాలు చేపట్టారాయన. క్రికెట్‌లో అంచెలంచెలుగా ఎదిగిన దాదా ఇప్పుడు రాజకీయాల్లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా.. దీదీ నుంచి అధికారం చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గ సమర్థ సారథి కోసం అన్వేషిస్తోంది. ఇదే క్రమంలో వారికి ప్రముఖంగా కనిపిస్తున్న పేరు.. సౌరవ్‌ గంగూలీ. ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దాదా కూడా తన రాజకీయరంగ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో పాటు నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘‘ఏం జరుగుతుందో చూద్దాం.. నా జీవితం గతంలో ఎన్నో అనూహ్య మలుపులు తీసుకుంది’’ అంటూ గంగూలీ స్పందించడం తన ఆసక్తిని తెలియజేస్తోంది.

గంగూలీ బీజేపీలో చేరతారని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగిన కారణాలు లేకపోలేదు. కమలదళం పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం దాదా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా ఆ సంస్థ కార్యదర్శిగా ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో దాదా బీజేపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూరుస్తుంది.

ఇదిలావుంటే, దాదా రాజకీయ అరంగేట్రం ఖరారైనట్లు గత ఏడాది చివర్లోనే వార్తలొచ్చాయి. అయితే- జనవరిలో ఆయనకు స్వల్ప గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. తర్వాత మళ్లీ స్టెంట్లు వేయించుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఆయన రాజకీయరంగ ప్రవేశంపై పునరాలోచనలో పడ్డారని, లేదంటే ఇప్పటికే ప్రచారంలో బిజీగా ఉండేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గంగూలీ కనుక బీజేపీ పక్షం చేరితే మాత్రం.. దీదీకి మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ఇప్పటికే సువేందు అధికారి రూపంలో మమతకు గట్టి సెగ తగులుతోంది. ప్రస్తుతం గంగూలీ కూడా తోడైతే బీజేపీని నిలువరించడం ఇబ్బందికర పరిణామమే. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం. పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో దాదా ప్రభావం ఎలా ఉండబోతుందో వేచిచూడాల్సింది.

Read Also… అమెరికా అధ్యక్షులవారి శునకం’ మేజర్’ వైట్‌హౌస్ వద్ద ఎవరినో కరిచిందట.. అలర్ట్ ప్లీజ్ !