పార్టీ విప్ పక్కన పెట్టేశారు… రాపాక దారి ఇక రహదారే
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు తన దారి రహదారేనని చాటుకున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో… ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లిఖిత పూర్వకంగా జారీ చేసిన విప్‌ని తుంగలో తొక్కేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మూడు రాజధానుల ప్రతిపాదన గట్టిగా సమర్థించారు. ముందుగా చెప్పినట్లుగానే తన మాట మీద తాను నిలబడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా […]
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు తన దారి రహదారేనని చాటుకున్నారు. ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో… ఏకంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లిఖిత పూర్వకంగా జారీ చేసిన విప్‌ని తుంగలో తొక్కేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. పార్టీ విధానానికి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మూడు రాజధానుల ప్రతిపాదన గట్టిగా సమర్థించారు.
ముందుగా చెప్పినట్లుగానే తన మాట మీద తాను నిలబడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేస్తానని ముందే చెప్పిన రాపాక… తనను అడ్డుకునేందుకు జనసేన అధినేత చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారు. తన దారి రహదారేనని.. ఇక మీరేదైనా చర్య తీసుకోవచ్చంటూ పరోక్షంగా పార్టీకి సవాల్ విసిరారు రాపాక. పార్టీ విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రకటన చేసిన రాపాక వరప్రసాద్.. బిల్లుపై ఓటింగ్ జరిగితే.. అనుకూలంగా ఓటు కూడా వేస్తానని చెప్పారు.
ఇదివరకే వైసీపీతో అంటకాగుతున్న రాపాక.. తరచూ ముఖ్యమంత్రిని కూడా కలుస్తూ వస్తున్నారు. ఇదేమంటే.. నియోజకవర్గం అభివృద్ది కోసమని చెబుతున్నారు. గట్టిగా అడగలేని పరిస్థితిలో ఇంతకాలం కొట్టుమిట్టాడిన జనసేన అధినాయకత్వం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమైనట్లే.. సోమవారం మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించాలంటూ ఏకైక ఎమ్మెల్యేకు విప్ జారీ చేసింది. లిఖితపూర్వకంగా సాక్షాత్తు అధినేత పంపిన లేఖను బేఖాతరు చేసిన రాపాక.. సభలో మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. తద్వారా బంతిని తిరిగి పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టిన రాపాక.. తనపై వేటు వేస్తే.. డైరెక్టుగా వైసీపీతో కలిసి పని చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.