గంటకు 198 కిలోమీటర్ల వేగం.. ప్రమాదకరంగా కారు నడుపుతూ లైవ్ వీడియో.. చివరికీ..!
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 198 కిలోమీటర్ల అతివేగంతో కారు నడుపుతూ ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో చేస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్ సమయంలో సామాజిక మాధ్యమాలపై శ్రద్ధ పెట్టడం, అతివేగం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. యువత సురక్షిత డ్రైవింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో కారు నడుపుతూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తి రెప్పపాటులో ప్రాణాలు కోల్పోయాడు. దూనీ ప్రాంతంలోని పోల్యాడా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మాల్‌పురాకు చెందిన 41 ఏళ్ల రాజారాం జాట్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో కారు స్పీడోమీటర్‌లో వేగం గంటకు 197 నుంచి 198 కిలోమీటర్ల వరకు నమోదైనట్లు కనిపిస్తోంది. కొద్ది సేపటికే కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతిన్నది. కారు డ్రైవర్ రాజారాం జాట్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇక ప్రమాదానికి ముందు సోషల్ మీడియాలో ప్రసారమైన లైవ్ వీడియో వెలుగులోకి రావడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది. గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో వాహనం నడుపుతూ లైవ్ చేయడం ప్రమాదకర డ్రైవింగ్‌కు నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఘటన మరోసారి అతివేగం ఎంతటి విషాదానికి దారితీస్తుందో స్పష్టం చేస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు, లైవ్ ప్రసారాల కోసం డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రాణాలకే ముప్పుగా మారుతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
