మళ్లీ దండెత్తిన మిడతల దండు..!

నెల క్రితం దాకా దాడి చేసిన మిడతల నుంచి ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, తాజాగా కొత్త మిడతల దండు మళ్లీ భారత్‌లోకి ప్రవేశించిందని రాజస్థాన్‌ వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

మళ్లీ దండెత్తిన మిడతల దండు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2020 | 6:04 PM

దేశంలో కరోనాకి తోడు ఉత్తరాదిన మిడతల దండు మొదలైంది. కరోనా మనుషుల ప్రాణాలతో ఆటాడుకుంటుంటే, మిడతలు పంటచేలను నాశనం పట్టిస్తున్నాయి. నెల క్రితం దాకా దాడి చేసిన మిడతల నుంచి ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, తాజాగా కొత్త మిడతల దండు మళ్లీ భారత్‌లోకి ప్రవేశించిందని రాజస్థాన్‌ వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

పాకిస్తాన్ దేశం నుంచి దండెత్తి వచ్చిన మిడతలు నెలరోజు క్రితం రాజస్థాన్‌లోకి ప్రవేశించాయి. జోథ్‌పూర్‌, జైసల్మేర్‌, బార్మెర్‌, గంగానగర్‌ జిల్లాల్లో భారీగా పంట చేలను ధ్వంసం చేశాయి. రాజస్థాన్ తో పాటు మధ్యప్రదేశ్ గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వివిధ ఆపరేషన్లు నిర్వహించిన చాలా మిడతల్ని నియంత్రించాయి. తాజాగా మరోసారి కొత్త దండు దేశంలోకి ప్రవేశిస్తోందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇవి గుడ్లు పెట్టి రావడం వల్ల కొత్త మిడతలు పుట్టుకొస్తున్నాయని రాజస్తాన్ వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్షాకాలం మొదలు కానున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా మిడతల దండు తరిమికొట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే బర్మేర్‌, జసల్మేర్‌, బికనేర్‌, జోథ్‌పూర్‌ ప్రాంతంలోని పంటపొలాలపై డ్రోన్‌ల సాయంతో రసాయనాలను పిచికారీ చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది. మిడతలను మట్టుబెట్టేందుకు అవసరమైతే నావికాదళ హెలికాప్టర్లను కూడా వినియోగించాలని కేంద్రం అనుమతినిచ్చింది. అధికారిక ఉత్తర్వులు వెలువడి వెంటనే హెలికాప్టర్ల ద్వారా పిచికారి చేస్తామన్నారు అధికారులు.