ఆ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీ సమావేశాలకు రావద్దన్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎమ్మెల్యేలకు ఇటీవల సమీపంగా మెలిగిన శాసన సభ్యులెవరూ అసెంబ్లీ రావద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
కరోనా మహమ్మరి ధాటికి జనంతో పాటు ప్రజా ప్రతినిధులు వణికిపోతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని నుంచి వైరస్ సోకుతుందన్న భయం వెంటాడుతోంది. కరోనా నుంచి ఎంత దూరం ఉంటే అంత మంచిదనుకుంటున్నారు. తాజా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఎమ్మెల్యేలకు ఇటీవల సమీపంగా మెలిగిన శాసన సభ్యులెవరూ అసెంబ్లీ రావద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కొవిడ్-19 కల్లోలం మధ్య ఒక్కరోజు పాటు పంజాబ్ అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ మేరకు అభ్యర్థించారు.
పంజాబ్‌లో కరోనా వైరస్ వికృతరూపం కొనసాగుతోంది. కొవిడ్ ఇన్ఫెక్షన్‌కు గురైన ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య 29కి చేరిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు త్వరితగతిన కరోనా పరీక్షలు చేసేందుకు వీలుగా విధాన సభ పరిసరాల్లో ట్రూనాట్, ఆర్ఏటీ మెషీన్లను ఏర్పాటు చేయాలంటూ సీఎం ఆదేశించారు. పంజాబ్ భవన్, ఎమ్మెల్యేల వసతిగృహాల్లో కూడా వీటిని ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు 48 గంటల ముందు కరోనా నెగిటివ్‌గా నిర్థారణ అయిన ఎమ్మెల్యేలకు మాత్రమే అసెంబ్లీలోకి ప్రవేశం కల్పించారు.
కాగా, ఈ నెల 20 నుంచి ఆమాద్మీ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలో చేపట్టిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలు ప్రజల జీవితాలకు పెను ముప్పుగా మారుతున్నాయని సీఎం అమరీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో కార్యక్రమంలో 25 నుంచి 250 మంది వరకు పాల్గొంటున్నారనీ… వారంతా పెద్దమొత్తంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఇప్పటికే ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిందనీ… వారిద్దరూ అనేక మందితో కలిసి ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నారని సీఎం తెలిపారు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే నలుగురు ఆప్ శాసన సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి భౌతికంగా సమావేశమయ్యే ఆందోళన కార్యక్రమాలు చేపట్టరాదంటూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఓ ప్రకటనలో అభ్యర్థించారు.