నిండు గర్బిణి ప్రాణం తీసిన చున్నీ
మెడలో ఉండే చున్నీ ఓ నిండి ప్రాణం బలి తీసుకుంది. అమ్మ కాబోతున్న ఆనందంలో ఉన్న ఆ వివాహితను రోడ్డు ప్రమాదం కబళించింది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమె వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా బైక్ వీల్ లో చున్నీ చుట్టుకుని ప్రాణాలొదిలారు.

మెడలో ఉండే చున్నీ ఓ నిండి ప్రాణం బలి తీసుకుంది. అమ్మ కాబోతున్న ఆనందంలో ఉన్న ఆ వివాహితను రోడ్డు ప్రమాదం కబళించింది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమె వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా బైక్ వీల్ లో చున్నీ చుట్టుకుని ప్రాణాలొదిలారు. ఆమె గర్భంలోని శిశువు సైతం మృతి చెందడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం రెడ్డిపాలెం సమీపంలో చోటుచేసుకుంది.
తిమ్మసముద్రానికి చెందిన చాట్రగడ్డ సుమ(22), సంతనూతలపాడుకు చెందిన మోషకు గత ఏడాది ఆగస్టులో వివాహం జరిగింది. గర్భం దాల్చిన ఆ మహిళ ప్రస్తుతం ఏడో నెల కావడంతో వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఒంగోలు బయలుదేరింది. రెడ్డిపాలెం సమీపంలో చున్నీ చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వెంటనే ఆమె ఆటోలో సంతనూతలపాడు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి చేరడంతో ఒంగోలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అయితే, అప్పటికే ఆమె మృతిచెందినని, ఆమె కడుపులోని శిశువు కూడా మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.దీంతో మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిండు గర్భిణి చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.