AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid politics ఏపీలో రాజకీయ రచ్చ.. డాక్టర్ సస్పెన్షనే కారణమా?

Political uproar in Andhra over doctor suspension: ఏపీలో ఓవైపు కరోనాపై సమరం కొనసాగుతుండగానే రాజకీయ యుద్దం మరోపక్క పురుడుపోసుకుంది. అది కూడా ఓ వైద్యునిపై ప్రభుత్వం చర్య తీసుకోవడంతో మొదలైంది. ఓ గ్రామీణ స్థాయి వైద్యుని విషయంలో ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం వాదులాటలకు, లేఖాస్త్రాలకు దిగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రజాభిప్రాయంతోను, పాండమిక్ సిచ్యుయేషన్‌తోను ప్రమేయం లేదన్నట్లుగా పాలక, ప్రతిపక్షాలు మాత్రం ఓ వైద్యుని అంశం ఆధారంగా ఆరోపణలకు, విమర్శలకు దిగుతూ వీధికెక్కడం […]

Covid politics ఏపీలో రాజకీయ రచ్చ.. డాక్టర్ సస్పెన్షనే కారణమా?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 09, 2020 | 1:04 PM

Share

Political uproar in Andhra over doctor suspension: ఏపీలో ఓవైపు కరోనాపై సమరం కొనసాగుతుండగానే రాజకీయ యుద్దం మరోపక్క పురుడుపోసుకుంది. అది కూడా ఓ వైద్యునిపై ప్రభుత్వం చర్య తీసుకోవడంతో మొదలైంది. ఓ గ్రామీణ స్థాయి వైద్యుని విషయంలో ఏకంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం వాదులాటలకు, లేఖాస్త్రాలకు దిగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. అయితే ప్రజాభిప్రాయంతోను, పాండమిక్ సిచ్యుయేషన్‌తోను ప్రమేయం లేదన్నట్లుగా పాలక, ప్రతిపక్షాలు మాత్రం ఓ వైద్యుని అంశం ఆధారంగా ఆరోపణలకు, విమర్శలకు దిగుతూ వీధికెక్కడం విశేషం.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన ఓ వైద్యుడు నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు, మెడికల్ స్టాఫ్‌కు ఇస్తున్న చేయూత సరిగ్గా లేదంటూ గళమెత్తడం, ఆ వెంటనే ఆ ప్రభుత్వ వైద్యునిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేయడం జరిగిపోయాయి. సదరు వైద్యునికి అండగా తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగారు. లోపాలను ఎత్తిచూపితే వైద్యునిపై చర్య తీసుకుంటారా అంటూ తొలుత విశాఖ టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, తదితరులు గళమెత్తారు. ఆ తర్వాత ఏకంగా నారాలోకేశ్ రంగంలోకి దిగి… క్రమశిక్షణాచర్యలకు కులం రంగు, దళిత కార్డు అప్లై చేశారు.

‘‘ ఓ దళిత డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు ఎందుకు జగన్ గారూ.. ’’ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు చంద్రబాబు. ఓ దళిత వైద్యునిపై వేటెందుకు ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు గురువారం ఉదయం రాసిన లేఖ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హల్‌చల్ చేస్తోంది. ‘‘ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో ఎనస్తీషియా డాక్టర్ సుధాకర్ రావును సస్పెండ్ చేయడం సరైన చర్యకాదు. పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్(పిపిఈ)లు అందుబాటులో లేక అనేకమంది డాక్టర్లు, వైద్య సిబ్బంది పడుతున్న ఆవేదననే సుధాకర్ రావు వెల్లడించారు. మాస్క్ లు, గ్లౌజులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు..’’ అంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తక్షణమే డాక్టర్ సుధాకర్ రావుపై సస్పెన్షన్ చర్యలు ఎత్తివేయాలని, నర్సీపట్నం వైద్యశాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో వైద్యులకు, ఆరోగ్యసిబ్బందికి కావాల్సిన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందజేయడం ద్వారా వారిలో మనోధైర్యం పెంచడంతో పాటు, బాధిత రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు లేఖపై రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. హైదరాబాద్ హోం క్వారెంటైన్‌లో వున్న చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గుర్తించకుండా లేఖలు రాయడం కరెక్టు కాదని వారంటున్నారు. కరోనా వైరస్‌ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురద జల్లేందుకు లాక్ డౌన్ సమయాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. పోస్టుకార్డులతో ఉద్యమాలు చేస్తూ.. చంద్రబాబు రాజకీయ రాబందులా మారారంటూ కన్నబాబు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కరోనాపై యుద్దం చేస్తుంటే చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొత్తానికి కరోనా లాక్ డౌన్ సమయం ఆంధ్ర ప్రజల్లో టెన్షన్ పెంచుతుంటే.. రాజకీయ వర్గాలు మాత్రం తమదైన శైలిలో టైమ్ పాస్ చేస్తున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.