Fact Check: నోట్ల రద్దు.. త్వరలో చెలామణిలోకి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు? ఇందులో అసలు నిజమెంతా?
జూన్ 30 నుంచి కాగితపు కరెన్సీని రద్దు చేసి ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెడతారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అలాంటి నిర్ణయం ఆర్‌బీఐ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది.

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ గొంతుతో కూడిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో జూన్ 30, 2026 నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్ని కరెన్సీ నోట్లను ఉపసంహరించి, వాటి స్థానంలో ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను ప్రవేశపెడుతుందని ప్రచారం చేశారు. అయితే ఈ వాదన పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ సంస్థ PIB స్పష్టం చేసింది.
PIB ఫ్యాక్ట్ చెక్ ప్రకారం.. RBI జూన్ 30 నాటికి కాగితపు కరెన్సీని రద్దు చేయడం గానీ, ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టడం గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ప్రజలు ఇలాంటి నిర్ధారణ లేని సందేశాలను నమ్మవద్దని, అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. అయితే ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్ల అంశం పూర్తిగా కొట్టిపారేయబడలేదు. ఇటీవల RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. కానీ ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉండటంతో పాటు నకిలీ కరెన్సీని అరికట్టడంలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా వాటిని అమలు చేయాలంటే RBI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ప్రకటన ఏదీ విడుదల కాలేదు. అందువల్ల జూన్ 30 నుంచి కాగితపు నోట్లు రద్దు అవుతాయన్న వార్త పూర్తిగా తప్పుడు ప్రచారం మాత్రమే. RBI అధికారిక ప్రకటన వెలువడే వరకు ప్రస్తుత కరెన్సీ నోట్లు చెల్లుబాటులోనే ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
