Petro Prices: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!

పెట్రో భారం సామాన్యునిపై బండమోపుతోంది. బండి తీసుకుని రోడ్డెక్కాలంటే బెంబేలెత్తిపోతున్నారు సామాన్యులు. అయితే.. ఈనాటి రోజు వారీ పెట్రో భారానికి బీజమెప్పుడు పడింది? ఈ పాపకార్యంలో ఎన్డీయే, యూపీఏల వాటా ఎంత?

Petro Prices: పెట్రోల్ పాపం యూపీఏదైతే.. డీజిల్ స్ట్రోక్ ఎన్డీయేది.. గత ప్రభుత్వాలేం చేశాయో తెలిస్తే షాకే!
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 23, 2021 | 4:37 PM

Petro Prices shocks common man: దేశంలో ప్రతీ రోజు పెరుగిపోతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు సామాన్యునికి షాకిస్తున్నాయి. ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుండడంతో ప్రజలు భవిష్యత్తుపై బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ ధర సెంచరీకి చేరువ కాగా డీజిల్ కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా పెట్రోల్ ధరతో పోటీ పడి మరీ పెరుగుతోంది. ఇదంతా ఎవరి పుణ్యం? ఎవరికి శాపం? ఈ చర్చ ఇప్పుడు ఎక్కడ విన్నా వినిపిస్తోంది. ప్రభుత్వాలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.

రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్న ఇంధనం ధరలు సామాన్యుని జీవితాలను మరింత కృశించిపోయేలా చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర సెంచరీని క్రాస్ చేసింది. రోజుకి 20 పైసల నుంచి 40 పైసల మధ్య పెరుగుతున్నాయి ఇంధనం ధరలు. 12 రోజుల నుంచి ప్రతీ రోజు పెరుగుదల కనిపిస్తూనే వుంది. మొత్తమ్మీద ఫిబ్రవరి నెలలో మంగళవారం (23వ తేదీ) నాటికి మొత్తం 15 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోల్‌‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచాయి చమురు సంస్థలు. దాంతో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.94.54కు చేరుకుంది. సెంచరీకి మరో అయిదున్నర రూపాయల దూరంలో నిలిచింది. హైదరాబాద్‌లో డీజిల్ ధర రూ.88.69కు చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.97.03కు చేరి సెంచరీకి మూడు రూపాయల దూరంలో నిలిచింది. ఆ నగరంలో డీజిల్ ధర రూ.90.64కు పెరిగింది. గత 54 రోజుల్లో చమురు ధరలు 25 సార్లు పెరిగాయి. 2020 మే నెలతో పోల్చుకుంటే లీటరు పెట్రోల్‌‌‌‌పై రూ.14.79, డీజిల్‌‌‌‌పై రూ.12.34 ధర పెరుగుదల చోటుచేసుకుంది.

గతంలో ఎలా ఉండేదంటే…

గతంలో పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ ప్రభుత్వాల చేతిలో వుండేది. చమురు కంపెనీలు కోరగా కోరగా.. ప్రభుత్వాలు సమయం చూసి నిర్ణయం తీసుకునేవి దానికి అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేవి. సహజంగానే విపక్షాలు ధరల పెంపుపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేవి. కొన్నాళ్ళకు అంతా కామనైపోయేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంటే బీజేపీ, బీజేపీ అధికారంలో వుంటే కాంగ్రెస్ సహా విపక్షాలు పెట్రో ఉత్పత్తుల ధరలను నిరసనగా పలు మార్లు ఎడ్ల బళ్ళ యాత్రలు నిర్వహించేవారు. ఇలా రెండు, మూడు నెలలకు ఒకసారి మాత్రమే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగేవి. ఈ విధానానికి తొలుత తిలోదకాలిచ్చింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే. 2004లో పెట్రోల్ ధరల నియంత్రణను అప్పటి మన్ మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ఎత్తివేసింది. చమురు సంస్థలే పెట్రోల్, డీజిల్ ధరలపై స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రజా రవాణాతో లింక్ అయి వున్న డీజిల్ ధరల నియంత్రణ మాత్రం ప్రభుత్వం వద్దనే పెట్టుకున్నారు.

డీజిల్ పాపం ఎన్డీయేది..

2014లో నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దాకా పెట్రోల్ ధరలపై చమురు సంస్థలు, డీజిల్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేవి. మోదీ ప్రధాన మంత్రి అయ్యాక అంటే 2014 అక్టోబర్‌లో డీజిల్ ధరల నియంత్రణ, నిర్ణయాధికారాలను కూడా చమురు సంస్థలకు కట్టబెట్టారు. 2014 అక్టోబర్లో డీజిల్ ధరలపై కూడా నియంత్రణను కేంద్రం ఎత్తివేసింది. అయితే ప్రతీ రోజు కాకుండా పదిహేను రోజులకు ఓసారి అంతర్జాతీయ చమురు ధరలు, రవాణా ఖర్చులకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం తీసుకునే వెసులుబాటును చమురు సంస్థలకు అప్పగించారు. ఈ విధానం 2017 జూన్ దాకా కొనసాగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయంతో ప్రతీ రోజూ చమురు ధరలను సవరించుకునే వెసులుబాటు చమురు సంస్థలకు దక్కింది. ఈ కొత్త విధానం 2017 జూన్ నుంచి అమల్లోకి వచ్చింది. 2014 మేలో మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.41గా వుండేది. ఆనాడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర గరిష్ట స్థాయిలో 106.85 అమెరికన్ డాలర్లు పలికింది.

ఈ విధంగా పెట్రోల్ భారాన్ని యూపీఏ ప్రభుత్వం పెంచితే.. డీజిల్ భారానికి ఎన్డీయే ప్రభుత్వం కారణమైంది. అయితే.. సంస్కరణల పేరిట ఈ మార్పులు తీసుకువచ్చేనాడు అప్పటి యూపీఏ ప్రభుత్వ పెద్దలైనా.. నేటి ఎన్డీయే ప్రభుత్వ అమాత్యులైనా చెప్పింది ఒక్కటే.. సామాన్యులపై భారం పడకుండా చమురు సంస్థలను నియంత్రించే పవర్ ప్రభుత్వం వద్దే వుంటుందని. అడ్డగోలుగా ధరలు పెంచితే ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటాయని పలు మార్లు చెప్పారు. కానీ తాజా పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

చమురు సంస్థలు రోజు వారీగా ఎడాపెడా ధరలను పెంచుతూ పోతున్నా.. లక్షల కోట్లు పన్ను రూపంలో దండుకుంటున్న కేంద్రం గానీ.. స్థానిక పన్నులు, వాట్ రూపంలో ఆదాయం దండుకుంటున్న రాష్ట్రాలుగానీ సామాన్యునిపై భారాన్ని ఇసుమంతైనా తగ్గించే ఆలోచన చేయడం లేదు. ఓ అంఛనా ప్రకారం గత ఆరేళ్ళలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 11 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తెలుస్తోంది. ఇందులో వాటా తీసుకుంటున్న రాష్ట్రాలు కూడా తామేమీ తక్కువ తినలేదనట్లు వ్యాట్ రూపంలో పెట్రో అమ్మకాలపై పన్ను విధిస్తూ ఖజానా నింపుకుంటున్నాయి.

తాజాగా విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై పలు రాష్ట్రాల్లో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి. కాంగ్రెస్ అధికారంలో వున్న రాష్ట్రాలలో బీజేపీ నేతలు, బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్, న్యూఢిల్లీలలో కాంగ్రెస్ ధర్నాలు నిర్వహించింది. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రో ధరలు తగ్గించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు లేఖలు రాశారు. కానీ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించినట్లు ఏ మాత్రం కనిపించడం లేదు.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే పెరిగితే త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పెట్రో ధరల అంశమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారే సంకేతాలున్నాయి. రాష్ట్రాలు కేంద్రాన్ని నిందిస్తే.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై అదనపు భారాన్ని తగ్గించుకోవాలని చెబుతోంది. ఇదిలా వుండగా..  కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన ఎంచక్కా పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌కు విఙ్ఞప్తి చేసి వదిలేశారు. అదేమంటే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందంటూ దాటేస్తున్నారు కేంద్ర మంత్రులు. మొత్తానికి పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించకుంటే భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై అవి పెను ప్రభావం చూపక తప్పదు.

ALSO READ: పెట్రో బాదుడులో ఎవరికి వారే సాటి.. పోటీ..! పన్ను పోటులో కేంద్రానికేం తీసిపోని రాష్ట్రాలివే