చిరు వ్యాపారులకు పేటీఎం గుడ్ న్యూస్.. పూచీలేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు
వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం. ఇకపై వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది.

వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం. ఇకపై వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రూ.1000 కోట్ల రుణాల మేర అందించి వ్యాపారులను మరింత ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యింది. మార్చిలోగా 1.7 కోట్ల మంది వ్యాపారులకు ఈ రుణాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యాపారం కోసం పేటీఎం యాప్‌ను ఉపయోగిస్తున్నవారికి ‘మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్’ కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలను మంజూరు చేస్తామని ఆ కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
కరోనా పుణ్యామాన్ని చితికిపోయిన చిరు వ్యాపారులకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు. వ్యాపారులు తమ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుని డిజిటల్ ఇండియా కార్యక్రమానికి చేయూతనిచ్చేందుకు ఈ రుణాలు దోహదపడతాయని పేటీఎం సంస్థ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీపై రూ.5 లక్షల వరకు రుణాలను అందజేసి వాటి అభివృద్ధికి దోహదపడేందుకు నిబద్ధతతో ఉన్నామని పేటీఎం పునరుద్ఘాటించింది.