AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ వలపు వలలో చిక్కిన ఖాకీ.. ఆయన డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అవ్వడం కొసమెరుపు

పేరు చందన. ఊరు ఆన్‌లైన్‌. వేస్తుంది వలపు వల. దానికి చిక్కిందో ఖాకీ చేప. ఇప్పుడది కొట్టుకుంటోంది గిలగిల. సీన్‌ కట్‌ చేస్తే...ఆడది కాస్తా మగాడిగా మారిపోయాడు. చందన కాస్తా పవన్‌కుమార్‌గా తేలాడు. లేడీ ముసుగులో పవన్‌ విసిరిన హనీట్రాప్‌లో ఓ కాప్‌ పడ్డాడు. ఎవరా కాప్‌?

పవన్ వలపు వలలో చిక్కిన ఖాకీ.. ఆయన డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ అవ్వడం కొసమెరుపు
Pawan Kumar
Ram Naramaneni
|

Updated on: Oct 23, 2026 | 7:58 AM

Share

వెయ్యిమందికి పైగా మగాళ్లను హనీట్రాప్‌ చేసిన పవన్‌ కుమార్‌ వలలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కూడా చిక్కారు. ఆయన పేరు బాలస్వామి. ఖైరతాబాద్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌. కర్మ కాలిందో, మోజు పుట్టిందో ఆయన కూడా పవన్‌ వలలో చిక్కుకుని ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఖైరతాబాద్‌ డీఐ బాలస్వామిని బ్లాక్‌మెయిల్‌ చేసినందుకు పవన్ కుమార్‌పై కొత్త కేసు నమోదయింది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డీఐకి పరిచయమైన కొండబత్తుల పవన్‌కుమార్‌… చందన పేరుతో నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలు సృష్టించి మోసం చేశాడని DI భార్య ఫిర్యాదు చేశారు. చందన తన బంధువని, ఆమెతో వివాహం జరిపిస్తానని డీఐని నిందితుడు నమ్మించాడు. ఆరు నెలల పాటు బాలస్వామిని లాడ్జిలో ఉంచి, భార్యాపిల్లలను కలవకుండా వేధింపులకు గురిచేశాడని పవన్‌పై ఫిర్యాదు అందింది. ఇంటికి వెళ్తే కేసులు పెట్టించి ఉద్యోగం పోయేలా చేస్తానంటూ బాలస్వామిని బెదిరించాట్ట సదరు పవన్‌ కుమార్‌. ఈమేరకు పోలీసులకు డీఐ భార్య హరిత ఫిర్యాదు చేశారు. తన భర్త మోసం చేశాడంటూ కవిత అనే మహిళతో పవన్ తప్పుడు కేసు పెట్టించాడని ఆ ఫిర్యాదులో ఇన్‌స్పెక్టర్‌ భార్య పేర్కొన్నారు. ప్రస్తుతం డీఐ బాలస్వామి ఈ కేసులో రిమాండ్‌లో ఉన్నారు.

హనీ ట్రాప్‌తో మనీ కొల్లగొట్టే కేటుగాడు

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన పవన్ కుమార్‌….సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలతో నకిలీ ఖాతాలు తెరిచి వందలాది మందిని బురిడీ కొట్టించాడు. పవన్‌ హనీట్రాప్‌లో వెయ్యిమందికి పైగా బాధితులు చిక్కుకుని లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మతి పోగొట్టే ఇతడి మోడస్‌ ఆపరాండిలో అపరంజి బొమ్మ లాంటి అమ్మాయి ఫొటోతో మతులు పోగొడతాడు. ఆ తర్వాత పర్సులు కొల్లగొడతాడు. ఇతగాడి పేరు పవన్ కుమార్. చదివింది ఇంటరు…అందుకే ఇంకమ్ నిల్లు. కానీ ఈజీగా మనీ సంపాదించాలని హనీట్రాప్ ఎంచుకున్నాడు.

అందమైన అమ్మాయి DPతో వల

వాట్సప్‌లో అందమైన అమ్మాయి ఫొటోను DPగా పెడతాడు. తర్వాత హాయ్ అని అవతలివాళ్లను మెసేజ్‌తో పలకరిస్తాడు. పొరపాటున పలికితే మాత్రం పనయ్యేదాకా వదలడు. నెమ్మదిగా ట్రాప్‌ చేసి బుట్టలో వేసుకుంటాడు..నిజంగానే అమ్మాయితో చాటింగ్ చేస్తున్నామన్న ఫీలింగ్ ఇస్తాడు. అవతలి వాళ్లు పూర్తిగా తన కంట్రోల్‌లోకి వచ్చాక ..అసలు దందా షురూ చేస్తాడు. వాళ్ల జేబు ఖాళీ అయ్యేవరకూ వీడేం చేస్తున్నాడో కూడా కనిపెట్టలేరు. అశ్లీలంగా చాటింగ్ చేయడం, అవతలి వాళ్ల న్యూడ్ ఫోటోలు, వీడియోలు తనకిచ్చేలా చేయడం, తర్వాత బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని దందా. ఇలా వందల మందిని.. ఆమాట కొస్తే వెయ్యి మందికిపైగా వీడి వల్ల మోసపోయారు.వాట్సప్‌లోనే కాదు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా ఫేక్‌ ఖాతాలతోనూ ఈ పవన్‌ వందల మందిని బురిడీ కొట్టించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు నొక్కేశాడు. ఈ కంత్రీగాడు వాడిన సోషల్‌ మీడియా అకౌంట్ల లెక్క చూస్తేనే వ్యవహారం ఎంత పద్ధతిగా నడిపాడో అర్థమవుతుంది. 13 ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలు, 14 ఫేక్‌ ఫేస్‌బుక్‌ ఐడీలను పోలీసులు గుర్తించారు. ఒక్కో అకౌంట్‌.. ఒక్కో అమ్మాయి అవతారం! ఒక్కో ప్రొఫైల్‌.. ఒక్కో కొత్త పరిచయం. ఇలా వెయ్యి మందికి పైగా వ్యక్తులతో చాటింగ్‌ చేసినట్టు పోలీసుల అంచనా. వారిలో 82 మంది తమ నగ్న ఫొటోలు, వీడియోలు పంపినట్టు దర్యాప్తులో తేలింది. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందినవారితో పాటు విదేశాల్లో ఉన్నవారూ ఈ వలలో చిక్కినట్టు పోలీసులు తెలిపారు.  ఇలా ఇతగాడి వలకు చిక్కి విలవిల్లాడుతున్న వాళ్ల జాబితాలో పోలీసులు కూడా చేరారు.

Follow Us