సముద్రానికి నా పేరు పెట్టండి.. ఆ అవార్డులూ నాకే ఇవ్వండి! ట్రంప్గారి కొత్త డిమాండ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భౌగోళిక ప్రాంతాల పేర్ల మార్పు నుంచి అంతర్జాతీయ పురస్కారాలపై తన అర్హత గురించి వ్యాఖ్యలు చేయడం వరకు ఆయన వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. నోబెల్ శాంతి బహుమతి తనకు రావాల్సిందని గతంలో పలుమార్లు అభిప్రాయపడిన ట్రంప్.. తాజాగా పులిట్జర్ అవార్డు గురించి కూడా ప్రస్తావించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భౌగోళిక ప్రాంతాల పేర్ల మార్పు నుంచి అంతర్జాతీయ పురస్కారాలపై తన అర్హత గురించి వ్యాఖ్యలు చేయడం వరకు ఆయన వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. నోబెల్ శాంతి బహుమతి తనకు రావాల్సిందని గతంలో పలుమార్లు అభిప్రాయపడిన ట్రంప్.. తాజాగా పులిట్జర్ అవార్డు గురించి కూడా ప్రస్తావించారు. అట్లాంటిక్ మహాసముద్రానికి తన పేరుతో కొత్త పేరు పెట్టాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఈ పరిణామాలు అమెరికా రాజకీయాల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
నోబెల్ రాలేదు.. పులిట్జర్ అయినా రావాలంటున్నారా?
ట్రంప్ చాలాకాలంగా నోబెల్ శాంతి బహుమతిపై తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పలు అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించడంలో తాను కీలక పాత్ర పోషించానని చెబుతూ, ఆ కృషికి గుర్తింపుగా తనకు ఈ పురస్కారం దక్కాల్సిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బహుమతి ఆయనకు లభించలేదు.
ఇదిలా ఉండగా, రచయితలు, జర్నలిస్టులకు అందించే ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డుపైనా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ కరోలినాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ, రష్యా జోక్యానికి సంబంధించిన కథనాలు రాసిన జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డులు లభించాయని విమర్శించారు. తన రచనలకు కూడా ఆ అవార్డు రావాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు దారితీశాయి. పులిట్జర్ అవార్డులు జర్నలిజం, సాహిత్యం, సంగీతం తదితర రంగాల్లో విశిష్ట కృషికి గుర్తింపుగా అందిస్తారు. నోబెల్ శాంతి బహుమతి, పులిట్జర్ అవార్డు రెండూ వేర్వేరు లక్ష్యాలు, ఎంపిక ప్రమాణాలతో కూడిన పురస్కారాలు కావడం గమనార్హం.
అట్లాంటిక్ మహాసముద్రానికి ‘ట్రంప్ ఓషన్’ పేరు?
ట్రంప్ పేరు మార్పుల వ్యవహారంలో మరో ఆసక్తికర అంశం అట్లాంటిక్ మహాసముద్రం. సౌత్ కరోలినాలో జరిగిన సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో ఈ విషయంపై మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడించారు. అట్లాంటిక్ మహాసముద్రానికి తన పేరుతో కొత్త పేరు పెట్టే ప్రతిపాదనను ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. అయితే అనేక దేశాల మధ్య విస్తరించి ఉన్న సముద్రానికి పేరు మార్చడం సాధ్యం కాదని పిచాయ్ చెప్పినట్లు ట్రంప్ వివరించారు. దీంతో ఆ ఆలోచన ముందుకు సాగలేదని పేర్కొన్నారు.
ఇప్పటికే పలు ప్రాంతాల పేర్ల మార్పు
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం పలు భౌగోళిక ప్రాంతాలు, ప్రభుత్వ విభాగాల పేర్ల మార్పునకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంది. 2025లో గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా పిలవడానికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. అలాస్కాలోని డెనాలి పర్వతం పేరును తిరిగి ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చే చర్యలు కూడా చేపట్టారు.
అలాగే అమెరికా రక్షణ శాఖను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా పిలిచే ప్రతిపాదనతో ట్రంప్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మార్పుల్లో కొన్ని అమెరికా అధికారిక వ్యవస్థలకు సంబంధించినవి కాగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భౌగోళిక పేర్ల మార్పులకు ఇతర దేశాల అభిప్రాయాలు, అంతర్జాతీయ సంప్రదాయాలు కూడా కీలకం అవుతాయి.
ఇక అలాగే, కెనడాతో సరిహద్దును పంచుకునే లేక్ అంటారియో వంటి ప్రాంతాల పేర్ల మార్పు ప్రతిపాదనలు కూడా చర్చకు వచ్చాయి. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాల అధికారిక నామకరణ విధానాలను ఆటోమేటిక్గా మార్చలేవు.
ప్రతి అంశంలో తనదైన ముద్ర వేయాలనే తపన?
ట్రంప్ నిర్ణయాలు, వ్యాఖ్యలు ఆయన మద్దతుదారుల్లో ప్రశంసలు పొందుతుండగా, విమర్శకులు మాత్రం వాటిని రాజకీయ ప్రచారంలో భాగంగా అభివర్ణిస్తున్నారు. పేర్ల మార్పు ద్వారా అమెరికా జాతీయ గుర్తింపును బలోపేతం చేయాలన్నది ఆయన వాదనగా కనిపిస్తోంది. మరోవైపు, అంతర్జాతీయ పురస్కారాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చలకు ఆజ్యం పోస్తున్నాయి.
అమెరికా వంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. అందుకే ట్రంప్ ప్రతి వ్యాఖ్య, ప్రతి ప్రతిపాదన అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. పేర్ల మార్పులు, అవార్డులపై ఆకాంక్షలు ఆయన రాజకీయ శైలిలో భాగమా? లేక వ్యక్తిగత గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నాలా? అన్న చర్చ మాత్రం కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
