పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు రాజ్యసభ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జీరో అవర్‌లో పలు అంశాలపై చర్చించాలంటూ పలువురు ఎంపీలు చైర్మన్‌కు నోటీసులు ఇచ్చారు. ‘నీట్ పరీక్షల నిర్వహణతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఈ అంశంపై జీరో అవర్‌లో చర్చించాలంటూ డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ నోటీసు ఇచ్చారు. అలాగే, కొవిడ్-19 కమ్యూనిటీ వ్యాప్తిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శాంతుసేన్, మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్, సినీ పరిశ్రమను కించపరిచే కుట్ర ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో నోటీసులు చైర్మన్ వెంకయ్యనాయుడుకు అందజేశారు.
కాగా, ఇవాళ రాజ్యసభలో కేంద్రం పలు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకునే యోచనలో ఉంది. దివాలా కోడ్ బిల్లుకు సంబంధించి రెండవ సవరణ, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ బిల్లు, ఆయుర్వేద బిల్లులో ఇనిస్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్, ఏయిర్‌క్రాఫ్ట్ సవరణ బిల్లులను రాజ్యసభ్య సభ ముందుంచనుంది కేంద్ర ప్రభుత్వం.