పోలీసుల ఆదేశాలు బేఖాతరు, చిత్తూరుజిల్లాలో దర్జాగా జల్లికట్టు పోటీలు, సంక్రాంతికి ముందే మొదలైన కోలాహలం
సంక్రాంతి పండుగ రాకుండానే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు మొదలయ్యాయి. పోలీస్‌ల అనుమతి లేనప్పటికీ చంద్రగిరి మండలం శానంబొట్లలో జల్లికట్టు..
సంక్రాంతి పండుగ రాకుండానే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు పోటీలు మొదలయ్యాయి. పోలీస్‌ల అనుమతి లేనప్పటికీ చంద్రగిరి మండలం శానంబొట్లలో జల్లికట్టు పోటీలు భారీ ఎత్తున నిర్వహించారు. జల్లికట్టు పోటీల్లో ఎద్దులను పట్టుకునేందుకు జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈసారి నిర్వహించిన జల్లికట్టు పోటీలకు తమిళనాడు నుంచి ఎద్దుల్ని రప్పించారు. కాగా, జిల్లాలో జల్లికట్టు నిర్వహణకు అనుమతి లేదని ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
పోటీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి చేతులు దులుపుకోవడంతో శానంబొట్లలో జల్లికట్టు పోటీల్ని దర్జాగా నిర్వహించారు. ఊళ్లో ఇంత హడావుడి జరగుతున్నా పోలీసులు ఎక్కడా కనిపించలేదు. పోటీలు నిర్వహించే వారు సైతం పోలీసుల ఆదేశాల్ని లెక్కచేయకపోవడంతో అపశృతి చోటు చేసుకుంది. తిరుపతి దగ్గర్లోని శానంబొట్ల గ్రామంలో నిర్వహిస్తున్న జల్లికట్టు పోటీలు కవరేజ్ చేస్తున్న టీవీ9 ప్రతినిధి రాజు గాయపడ్డారు. ఘటనా స్థలానికి అంబులెన్స్ రావడంతో అతడికి ప్రాథమిక చికిత్స అందించారు.