ఎట్టకేలకు గాంధీలో సాధారణ సేవలు.. రేపటి నుంచి అన్ని రకాల రోగులకు అనుమతి.. విజిటర్స్ అవర్ రద్దు..

రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది.

  • Balaraju Goud
  • Publish Date - 9:21 pm, Fri, 20 November 20
ఎట్టకేలకు గాంధీలో సాధారణ సేవలు.. రేపటి నుంచి అన్ని రకాల రోగులకు అనుమతి.. విజిటర్స్ అవర్ రద్దు..

రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలను నిలిపివేసింది. మార్చి 2 నుండి గాంధీ ఆస్పత్రి కొవిడ్‌ పాజిటివ్‌ రోగులకు మాత్రమే సేవలు అందిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎనిమిది నెలల విరామం అనంతరం గాంధీలో రేపటి నుండి సాధారణ రోగులకు కూడా సేవలు మొదలు కానున్నాయి. ఔట్‌ పేషెంట్స్‌, ఇన్‌ పేషెంట్స్‌, ఎమర్జెన్సీ సర్వీసులు శనివారం తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు అధికారులు ఇప్పటికే అన్ని రకాల చర్యలు చేపట్టారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజా రావు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఒకవైపు కొవిడ్‌ పాజిటివ్‌ రోగులకు మరోవైపు నాన్‌ కొవిడ్‌ రోగులకు ఒకేసారి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. నాన్‌ కొవిడ్‌ రోగుల దృష్ట్యా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెప్పారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాన్‌ కొవిడ్‌ రోగుల వెంబడి ఒక్క సహాయకుడిని మాత్రమే అనుమతించనున్నట్లు రమేష్ రెడ్డి తెలిపారు. వేర్వేరు ఎంట్రీ, ఎగ్జిట్‌ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు సందర్శనకు అనుమతి లేదన్నారు. మాస్కులు లేనివారిని రావద్దని సూచించారు. గాంధీ ఆస్పత్రిలో విజిటింగ్‌ అవర్స్‌ నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోగి వెంట ఒక్క సహాయకుడిని మాత్రమే అనుమతిస్తామన్నారు.