నిర్మల బడ్జెట్లో..కొన్ని రాయితీలు..కొన్ని ‘ ముళ్ళు ‘ !

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని రాయితీలు ఇస్తూనే..మరికొన్ని ‘ షాకింగ్స్ ‘ కూడా ప్రకటించారు. అయితే మెజారిటీ ప్రజల ఆశలమీద ఈ బడ్జెట్ నీళ్లు చెల్లిందని, భారీ పథకాల ప్రకటనలేవీ లేవని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు కొన్ని మినహాయింపులు, కొన్ని సుంకాలను పెంచితే .. పాన్, ఆధార్ వంటివాటి వినియోగంపై ప్రత్యామ్నాయ ప్రకటనలు చేశారు. పాన్ కార్డు లేనివారు తమ టాక్స్ రిటర్నుల దాఖలుకు ఆధార్ ను […]

నిర్మల బడ్జెట్లో..కొన్ని రాయితీలు..కొన్ని ' ముళ్ళు ' !
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 05, 2019 | 4:42 PM

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని రాయితీలు ఇస్తూనే..మరికొన్ని ‘ షాకింగ్స్ ‘ కూడా ప్రకటించారు. అయితే మెజారిటీ ప్రజల ఆశలమీద ఈ బడ్జెట్ నీళ్లు చెల్లిందని, భారీ పథకాల ప్రకటనలేవీ లేవని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు కొన్ని మినహాయింపులు, కొన్ని సుంకాలను పెంచితే .. పాన్, ఆధార్ వంటివాటి వినియోగంపై ప్రత్యామ్నాయ ప్రకటనలు చేశారు. పాన్ కార్డు లేనివారు తమ టాక్స్ రిటర్నుల దాఖలుకు ఆధార్ ను సమర్పిస్తే చాలని స్పష్టం చేశారు. దేశంలో 120 కోట్లమందికి ఆధార్ కార్డులున్నాయని ఆమె గుర్తు చేశారు. గృహ రుణాల విషయానికి వస్తే.. వచ్ఛే ఏడాది మార్చి వరకు తీసుకున్న ఈ రుణాలపై రూ. 1. 50 లక్షల అదనపు వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ఆమె తెలిపారు. విద్యుత్ వాహనాల కొనుగోలుకు తీసుకునే రుణాల మీద వడ్డీపై రూ. 1. 50 లక్షల మేర ఆదాయపు పన్ను డిడక్షన్ ఇవ్వనున్నట్టు వివరించారు. విద్యుత్ వాహనాలపై జీఎస్టీ ని 12 శాతం నుంచి 5 శాతానికి తెచ్చే యోచన ఉందని, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్నదే తమ ధ్యేయమని నిర్మల వివరించారు. ఇక మధ్యాదాయ, అల్పాదాయ వర్గాలకు ఆదాయపు పన్ను శ్లాబులు మారలేదు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతారని ఆశించిన ఈ వర్గాలకు నిరాశే మిగిలింది. బడా బాబులపై మాత్రం నిర్మలా సీతారామన్ బడ్జెట్ కొరడా ఝళిపించింది. వీరి ఆదాయంపై సర్ చార్జీని 3 శాతం పెంచనున్నారు. రూ. 2 కోట్ల నుంచి 5 కోట్ల మధ్య ఆదాయం ఉన్నవారు ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి అయిదు కోట్లకు మించి ఆదాయం పొందుతున్నవారికి 7 శాతం సర్ చార్జీ విధిస్తారు. అయితే 5 లక్షల లోపు ఉన్న వర్గాలను పన్ను చెల్లింపు నుంచి మినహాయించారు. ఏడాదిలో బ్యాంకు ఖాతాల నుంచి కోటి రూపాయలకు పైగా విత్ డ్రా చేసిన పక్షంలో దానిపై 2 శాతం టీడీఎస్ ని మోదీ ప్రభుత్వం ప్రకటించింది. భారీ నగదు మొత్తాల విత్ డ్రా ను నివారించేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకున్నారు. కాగా-ఆటో విడిభాగాలు, ఆప్టికల్ ఫైబర్స్, డిజిటల్ కెమెరాలు, జీడిపప్పు, సింథటిక్ రబ్బర్, వినైల్ ఫ్లోరింగ్ పై కస్టమ్స్ సుంకాలను ప్రభుత్వం పెంచింది. అలాగే బంగారంపై ఈ సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడం ముఖ్యంగా మహిళలకు చేదు వార్తే.. అలాగే పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై ప్రత్యేక ఎక్సయిజు సుంకం పెంచడం సామాన్యుడికి దెబ్బే . వీటికి సంబంధించి లీటరుకు రూపాయి చొప్పున సెస్ పెంచడం విశేషం. మహిళల్లో జనధన్ ఖాతా కలిగిన స్వయం సహాయక బృందాల మహిళలకు ముద్రా యోజన కింద అయిదు వేల ‘ ఓవర్ డ్రాఫ్ట్ ‘ ను కేటాయించనున్నారు. ఈ మహిళలకు లక్ష రూపాయల రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. దిగుమతి చేసుకునే పుస్తకాలపై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించనున్నట్టు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా-ఇండియాలో భారతీయ పాస్ పోర్టులు కలిగిన ఎన్ ఆర్ ఐ లకు 180 రోజులవరకు వేచి ఉండే అవసరం లేకుండా ఆధార్ కార్డులను జారీ చేసే యోచన ఉన్నట్టు ఆమె ప్రకటించారు. దేశంలో సుమారు 3 కోట్లమంది చిల్లర వ్యాపారులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్టు నిర్మల వెల్లడించారు. వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న రిటెయిల్ ట్రేడర్లకు పెన్షన్ బెనిఫిట్ కల్పించారు. ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ యోజన కింద ఇది వర్తించనుంది. జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకున్న మధ్య శ్రేణి సంస్థలకు రెండు శాతం వడ్డీతో రుణాలు ఇవ్వనున్నారు. ఇందుకు రూ. 350 కోట్లు కేటాయించినట్టు ఆర్ధిక మంత్రి తెలిపారు. అద్దె ఇంటి చట్టాలు మారుస్తామని ఆమె చెప్పారు. ఏమైనా.. ఇది సాదాసీదా బడ్జెట్ అని, అసలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగేదేమీ కనిపించడంలేదని ఈ రాష్ట్రాల ఆర్ధిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. దేశంలో నిరుద్యోగ సమస్యను ఎలా రూపు మాపుతామన్న హామీ గానీ, వ్యవసాయం, ఆరోగ్యం,రక్షణ, పరిశ్రమలు, రైల్వే, విద్య వంటి కీలక రంగాల అభివృధ్దికి ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నప్రకటనలు గానీ ఈ బడ్జెట్లో లేకపోవడం విచారకరమన్నది వారి అభిప్రాయం.