మహారాష్ట్ర ప్రజలకు మరో భయం.. శరద్ పవార్ వ్యాఖ్యలే కారణమా?

తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడం రాజకీయ నేతలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. మనదేశ చరిత్రలో ఎన్నో ఘోర దుర్ఘటనలు రాజకీయ నేపథ్యానికి చెందినవనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. రాజకీయ పార్టీలు.. మతం రంగు పులుముకున్న తర్వాత హింసాత్మక సంఘటనల సంఖ్య మరీ పెరిగిపోయింది. తమ రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేసే సమయంలో సామాన్య ప్రజల్ని సైతం వివిధ పార్టీలు భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరం. ఇప్పటికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణం, ఆ […]

మహారాష్ట్ర ప్రజలకు మరో భయం.. శరద్ పవార్ వ్యాఖ్యలే కారణమా?
Follow us

| Edited By:

Updated on: Sep 21, 2019 | 6:25 PM

తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవడం రాజకీయ నేతలకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. మనదేశ చరిత్రలో ఎన్నో ఘోర దుర్ఘటనలు రాజకీయ నేపథ్యానికి చెందినవనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. రాజకీయ పార్టీలు.. మతం రంగు పులుముకున్న తర్వాత హింసాత్మక సంఘటనల సంఖ్య మరీ పెరిగిపోయింది. తమ రాజకీయ ప్రత్యర్ధులపై విమర్శలు చేసే సమయంలో సామాన్య ప్రజల్ని సైతం వివిధ పార్టీలు భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరం. ఇప్పటికే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణం, ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హత్య, అటు తర్వాత ముంబై మత ఘర్షణలు, గోద్రా అల్లర్లు… ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మన లౌకిక దేశంలో ఎన్నో దారుణమైన హింసాత్మక ఘటనలు జరిగాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు మృతి చెందారు. ఈ దాడి తర్వాత వివిధ రాజకీయ పార్టీలు అధికార బీజేపీపై విరుచుకుపడ్డాయి. ఇది మోదీ ప్రభుత్వం జరిపిన దాడిగా కూడా అభివర్ణించాయి. ఈ దాడి ప్రమాదకర సంఘటనగా కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆనాడే ఆరోపించారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులు 40మంది జవాన్లను పొట్టన బెట్టుకుంటే దిగ్విజయ్ మాత్రం ఈ ఘటనను ‘ ప్రమాదకర ఘటన’గా చెప్పడంపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతి విమర్శలు చేశాయి. దిగ్విజయ్ వ్యాఖ్యలతో పాటు కొంతమంది బీజేపీ నేతలు కూడా పుల్వామా దాడిపై అదే విధమైన వ్యాఖ్యలు చేయడంతో ఆపార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘ఆ దాడి ఓ పెద్ద ప్రమాద ఘటన’ అంటూ యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. అయితే పుల్వామా ఘటన తర్వాత బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగింది. అయినా ఇప్పటికీ పుల్వామా దాడి ప్రస్తావన దేశ రాజకీయాల్లో చర్చకు వస్తూనే ఉంది.

తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ ఈ వ్యాఖ్యలను రాజేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వంపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉందని, కానీ ఆ సమయంలో పుల్వామా ఘటన జరగడంతో అది బీజేపీకి, మోదీకి అనుకూలంగా మారిందన్నారు పవార్. తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల సందడి మొదలైన నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బహుషా దీన్ని మార్చాలంటే మరో పుల్వామా వంటి ఘటన జరగాలేమో.. అంటూ వివాదాస్పద కామెంట్ చేశారు.

జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన బాంబ్ పేలుడు ఘటనలో 40 మంది భారతీయ జవాన్లు మృతి చెందారు. దీనిపై ఇప్పటికే ఎన్నో సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దీనికి ఉదాహరణగానే తాజాగా శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు. ఇదిలా ఉంటే గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా పుల్వామా దాడి తర్వాత పాక్ మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏదో ఒక ఘటన జరుగుతుందని భావించానని.. కానీ ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతుందని ఊహించలేదంటూ అధికార బీజేపీపై అనుమానాలు వ్యక్తం చేశారు.

బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబై మత ఘర్షణలు, గోద్రా అల్లర్లు, పుల్వామా దాడులలో వేలాది మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. పుల్వామాలో జరిగిన బాంబు దాడిలో 40 మంది జవాన్లు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్దికోసం ఆయా సంఘటనల్ని రాజకీయ కోణంలోనే చూస్తూ, ఓట్లు, సీట్లకోసం సామాన్య ప్రజల మధ్య భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా శరత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజల్లో భయాన్ని, అభద్రతను కలిగించేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.