Bectors Food : బెక్టర్స్ ఫుడ్ ఐపీవో…. 198 రేట్లు అధికంగా బిడ్స్… కేటాయింపు నేటి నుంచే..
బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి బిడ్స్ వెల్లువెత్తాయి. డిసెంబర్ 15 - 17 మధ్య జరిగిన ఇష్యూకి198 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి.
బిస్కట్ల తయారీ కంపెనీ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ పబ్లిక్ ఇష్యూకి బిడ్స్ వెల్లువెత్తాయి. డిసెంబర్ 15 – 17 మధ్య జరిగిన ఇష్యూకి198 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఐపీవోలో భాగంగా కంపెనీ 1.32 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 262 కోట్ల షేర్లకుపైగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రధానంగా సంపన్న వర్గాల నుంచి 621 రెట్లు అధికంగా దరఖాస్తులు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సైతం 29 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 177 రెట్లు అధికంగా బిడ్స్ లభించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది.
రూ. 540 కోట్లు సమీకరణ…
బెక్టర్ ఫుడ్ ఐపీఓ ధరల శ్రేణి రూ. 286-288కాగా.. తద్వారా కంపెనీ రూ. 540 కోట్లు సమీకరించింది. ఐపీవో ప్రారంభానికి ముందురోజు ఇన్వెస్టర్ల నుంచి రూ. 162 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 288 ధరలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, గోల్డ్‌మన్ శాక్స్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్, ఎస్‌బీఐ డెట్ హైబ్రిడ్ తదితర 7 ఎంఎఫ్‌లకు షేర్లను కేటాయించింది.
అందుకే అంత డిమాండ్…
బెక్టర్స్ ఫుడ్ బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, పిజ్జా హట్ తదితర గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్(క్యూఎస్‌ఆర్)కు బన్స్ సరఫరా చేస్తోంది. బెక్టర్స్ క్రీమికా పేరుతో సొంతంగా ప్రీమియం బిస్కట్లను తయారు చేస్తోంది. లూధియానాకు చెందిన కంపెనీ ఇంతక్రితం 2018లోనూ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలు చేసింది. సెబీ అనుమతించినప్పటికీ మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకుంది.
మార్కెట్‌లో పోటీని తట్టుకుని…
ఐటీసీ, బ్రిటానియాతోపాటు.. పార్లే ఇండియా, మోడర్న్, హార్వెస్ట్ గోల్డ్ కంపెనీలతో బెక్టర్స్ ఫుడ్ పోటీ పడుతోంది. గ్లోబల్ ఫాస్ట్‌ఫుడ్ చైన్స్‌కు భారీ స్థాయిలో బన్స్ సరఫరా చేయడంతోపాటు.. ఫ్రోజెన్ డఫ్ విభాగంలోకీ ప్రవేశించింది. తద్వారా ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న బేకర్స్ సర్కిల్‌తో పోటీని ఎదుర్కొంటోంది. 2019 మార్చికల్లా బెక్టర్స్ ఫుడ్ ఆదాయం రూ. 762 కోట్లను తాకింది. రూ. 30 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా బిస్కట్లు, బేకరీ ప్రొడక్టుల రిటైల్ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 52,000 కోట్లు)గా అంచనా. గత ఐదేళ్లలో వార్షికంగా 9 శాతం వృద్ధిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్ విలువలో బిస్కట్లు, రస్కులు, వేఫర్స్, కేకులు 89 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. బన్నులు, పిజ్జా బేస్‌లు తదితరాల వాటా 11 శాతమని పరిశ్రమ నిపుణులు తెలియజేశారు!
రీఫండ్ నేటి నుంచే….
బెక్టర్స్ ఫుడ్ ఐపీవో బిడ్‌లో 7,44,91,524 షేర్లకు గానూ 581 రేట్లు అధికంగా 11,66,93,73,500 బిడ్స్ వచ్చాయి. ఈ రేంజ్‌లో బిడ్స్ రావడానికి కారణం ఈ మధ్య కాలంలో బెక్టర్స్‌కు నష్టాలు తగ్గి లాభాలు పెరగడమే. అంతేకాకుండా బర్గ్ ఇండస్ట్రీకి మొత్తానికి బన్స్ సరఫరా చేయడమే. కాగా షేర్ల అలాట్ మెంట్ డిసెంబర్ 22నే మొదలైంది. ఎక్కవ వచ్చిన బిడ్లకు రీఫండ్ ప్రాసెస్ డిసెంబర్ 23న మొదలవుతోంది. క్రెడిట్ షేర్లకు సంబంధించిన చెల్లింపులు డిసెంబర్ 24న మొదలవనున్నాయి. ఇక స్టాక్ లిస్టింగ్ డిసెంబర్ 28న జరగనుంది. బిడ్‌లో పాల్గొన్నవారు వారికి షేర్లు కేటాయించారో లేదో అనేది ‘లింక్ ఇన్‌టైం ఇండియాస్ వెబ్ పోర్ట్’ లో చెక్ చేసుకోండి. ఆ వెబ్ సైట్‌లో మీరు బిడ్‌లో పాల్గొన్న సమయంలో తెలిపిన వివరాలు… అప్లికేషన్ ఐడీ, పాన్ ఐడీ, క్లైంట్ ఐడీ, డీపీఐడీ వంటి వివరాలు నమోదు చేస్తే మీకు షేర్ కేటాయించారో లేదో తెలుస్తుంది.