రైతు చట్టాలను చాలామంది అన్నదాతలు సమర్థించారు, పరిష్కారం కనుచూపు మేరలో ఉందని ఆశిస్తున్నా, కేంద్ర మంత్రి తోమర్

రైతు చట్టాలను అన్నదాతల్లో చాలామంది సమర్థించారని, సమస్య పరిష్కారం కనుచూపు మేరలో ఉందని భావిస్తున్నామని  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్..

  • Umakanth Rao
  • Publish Date - 3:45 pm, Sun, 17 January 21
రైతు చట్టాలను చాలామంది అన్నదాతలు సమర్థించారు, పరిష్కారం కనుచూపు మేరలో ఉందని ఆశిస్తున్నా, కేంద్ర మంత్రి తోమర్

రైతు చట్టాలను అన్నదాతల్లో చాలామంది సమర్థించారని, సమస్య పరిష్కారం కనుచూపు మేరలో ఉందని భావిస్తున్నామని  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అన్నారు. మంగళవారం రైతు సంఘాలతో తాము జరపనున్న చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అటు సుప్రీంకోర్టు కూడా సోమవారం ఈ జటిల అంశానికి సరైన పరిష్కారం చూపగలదని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. కేంద్రంతో రైతులు మంగళవారం పదో దఫా చర్చలు జరపనున్నారు.  సుప్రీంకోర్టు ఉత్తర్వుల తరువాత రైతు చట్టాలను అమలుపరచలేకపోతున్నట్టు తోమర్ చెప్పారు. ( ఈ చట్టాలపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది). ఇక రైతులు క్లాజులవారీగా  తమలో తాము చర్చించుకుని ఈ నెల 19 న తమకు ఏం కావాలో స్పష్టం చేయవచ్చు అన్నారాయన. తాజాగాప్రభుత్వం రైతు సంఘాలకు ఓ ప్రతిపాదన పంపిందని, మండీలు, ట్రేడర్ల రిజిస్ట్రేషన్లు, ఇతర అంశాలపై  వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఇందులో హామీ ఇచ్చిందని ఆయన వివరించారు. విద్యుత్ సవరణ చట్టంపై ప్రభుత్వం వారి డిమాండుకు సానుకూలంగా స్పందించిందని, కానీ వారు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అదేపనిగా డిమాండ్ చేస్తున్నారని తోమర్ పేర్కొన్నారు.

ఇలా ఉండగా ఆదివారం రైతు యూనియన్లు వేర్వేరుగా సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నాయి. ముఖ్యంగా ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలా వద్దా అన్న విషయమే ఈ చర్చల్లో ప్రధాన అజెండాగా నిలిచింది.