తెలంగాణ కొత్త రెవెన్యూ బిల్లుకు ఎంఐఎం మద్దతుః అక్బరుద్దీన్
నూతన రెవిన్యూ బిల్లుపై మజ్లీస్ పార్టీ తరపున ఆ పార్టీ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభినందనలు తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ చారిత్రాత్మక రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టింది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ బిల్లును ప్రవేశపెట్టిన రోజే తాను సవివరంగా తెలిపాను. ఈ బిల్లుపై సభ్యులు సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని అన్నారు. ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభకు వివరంగా ఇస్తానని సీఎం తెలిపారు.
నూతన రెవిన్యూ బిల్లుపై మజ్లీస్ పార్టీ తరపున ఆ పార్టీ శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అభినందనలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ బిల్లు చట్టానికి ఎంఐఎం పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భూములకు సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా చాలాచోట్ల ఆక్రమణదారులకు మద్దతుగా ఉన్నాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చాక చాలా మంది భూములు పోయాయన్న అక్బరుద్ధీన్.. పట్టాల ఎంట్రీలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి రికార్డుల్లో ఉన్న వివరాల్లో తేడాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నానని అక్బరుద్ధీన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయాలు, దర్గా, వక్ఫ్ భూములను ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని, ఈ మేరకు బిల్లులో సవరణ తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్లమ్ ఏరియాల్లో నోటరీ ద్వారా కొనుగోలు చేసి భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి ఓవైసీ సూచించారు.