మేఘా ఇంజినీరింగ్ సామాజిక బాధ్యత, అత్యున్నత సౌకర్యాలతో నిమ్స్‌లో నిర్మించిన ఆంకాలజీ బ్లాక్ 9న ప్రారంభం
కార్పొరేట్ సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ మరోసారి తన సామాజిక..
కార్పొరేట్ సామాజిక బాధ్యతను నిర్వర్తించడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ మరోసారి తన సామాజిక బాధ్యతను నెరవేర్చింది. క్యాన్సర్ వ్యాధి చికిత్సతో సాధారణ, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోన్న నేపథ్యంలో ఎంఈఐఎల్ ముందుకొచ్చింది. హైదరాబాద్ లోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థ నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (నిమ్స్) లో క్యాన్సర్ చికిత్స విభాగంలో పూర్తిస్థాయి సేవలు అందించడానికి అవసరమైన భవన, వైద్య, యంత్రాలు, బెడ్లు తదితర సౌకర్యాలను ఎంఈఐఎల్ సమకూర్చింది. ఈ భవనాన్ని(బ్లాక్) ఈనెల 9న ఉదయం 11గంటలకు తెలంగాణ వైద్య, ఆరోగ్యమంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభిస్తారు.
ఇదేకాకుండా, గతంలో నిర్మించిన రెండవ అంతస్తు నిర్వహణ బాధ్యతలను కూడా గడిచిన మూడేళ్లుగా మేఘా నిర్వహిస్తోంది. నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ రోగుల కోసం భారీ నిధులతో ప్రత్యేక విభాగాన్ని 2018 సెప్టెంబర్ లోనే ప్రారంభించింది మేఘా ఇంజినీరింగ్. ఆంకాలజీ భవనం ప్రారంభ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తును పరిశీలించిన ఎంఈఐఎల్ ఛైర్మన్ పివి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి ఈ రెండిటిని పునర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కోట్ల రూపాయల వ్యయంతో అంకాలజీ విభాగాన్ని, భవనాన్ని, అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలతో పున:నిర్మించారు.