బాలు కోసం రేపు సామూహిక ప్రార్థనలు.
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అనేకమంది కాంక్షిస్తున్నారు. ఎవరికి వాళ్లు భగవంతుడ్ని కోరుతూ వివిధ మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం కుదుటపడేందుకు..
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా అనేకమంది కాంక్షిస్తున్నారు. ఎవరికి వాళ్లు భగవంతుడ్ని కోరుతూ వివిధ మాధ్యమాల్లో స్పందిస్తున్నారు. ఎస్పీబీ ఆరోగ్యం కుదుటపడేందుకు ఆగష్టు 20 సాయంత్రం 6 గంటలకు అభిమానులంతా సామూహిక ప్రార్థనలు చేయాలని తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తాజాగా పిలుపునిచ్చారు. హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, దర్శకులు భారతీరాజా, రైటర్ వైరముత్తు కలిసి ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
బాలు అభిమానులంతా ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే ఉండి ఆయన పాడిన పాటలను ప్లే చేయాలని.. ఆతని గొంతు మళ్లీ మనమంతా వినేలా చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. అటు, దర్శకుడు భారతీ రాజా ఇదే అంశానికి సంబంధించి ఒక ప్రకటన, వీడియో కూడా రిలీజ్ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన కళాకారులు, కార్మికులందరం ఆగష్టు 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఒక నిమిషం పాటు ప్రార్థన చేయబోతున్నామని, బాలుని రక్షించాలని ప్రకృతితల్లిని అర్థించబోతున్నామని తెలిపారు.
కరోనా బారినపడిన బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులు ప్రకటనలు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతోందని వెల్లడిస్తున్నారు. కాగా, బాలు ఆరోగ్యంగా ఆస్పత్రినుంచి తిరిగి రావాలని కోరుతూ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, గాయని విజయలక్ష్మి ఇచ్చిన పిలుపుతో మంగళవారం సాయంత్రం సంగీత కళాకారులు ఎవరికి వారు దేవుడ్ని కొలిచిన సంగతి తెలిసిందే.