నిరసనలో మేమూ ! ఢిల్లీకి నాసిక్ నుంచి బయలుదేరుతున్న రైతులు, బైక్ ర్యాలీలో 5 వేలమంది అన్నదాతలు !

ఢిల్లీ సరిహద్దుల్లో 26 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మహారాష్ట్ర అన్నదాతలు కూడా భారీ బైక్ ర్యాలీకి సిధ్దమయ్యారు. సుమారు 5 వేలమంది రైతులు నాసిక్ నుంచి 'వెహికల్ మార్చ్..

నిరసనలో మేమూ ! ఢిల్లీకి నాసిక్ నుంచి బయలుదేరుతున్న రైతులు, బైక్ ర్యాలీలో 5 వేలమంది అన్నదాతలు !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 21, 2020 | 2:52 PM

ఢిల్లీ సరిహద్దుల్లో 26 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మహారాష్ట్ర అన్నదాతలు కూడా భారీ బైక్ ర్యాలీకి సిధ్దమయ్యారు. సుమారు 5 వేలమంది రైతులు నాసిక్ నుంచి ‘వెహికల్ మార్చ్’ కి శ్రీకారం చుట్టారు. మొత్తం 20 జిల్లాలనుంచి రైతులు నాసిక్ చేరుకుని అక్కడి నుంచి సుమారు 1300 కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీ బోర్డర్ చేరనున్నారు. అనంతరం ఈ నెల 24 న రాజస్తాన్ -హర్యానా సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న వారిని కూడా కలుసుకుని తమ సంఘీభావం తెలపనున్నారు. రైతు చట్టాలను రద్దు చేయాలని  కోరుతూ కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే నిరసన చేస్తున్నారన్న కేంద్రం వాదన సరికాదని, మహారాష్ట్ర రైతులు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారని చాటడానికే ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు తెలిపారు. మధ్యప్రదేశ్ లో ప్రవేశించే ముందు వీరంతా మాలెగావ్, షిర్ పూర్ వంటి వివిధ జిల్లాల గుండా ప్రయాణిస్తారని వారు చెప్పారు.

ఇలా ఉండగా యూపీలో రాష్ట్ర వ్యాప్తంగా తాము నిరసన శిబిరాలను నిర్వహిస్తామని వివిధ రైతు సంఘాలు వెల్లడించాయి. తమ 31 ట్రాలీలను పోలీసులు గంటలతరబడి తమ స్వాధీనంలో ఉంచుకున్నారని, కానీ ఈ విధమైన చర్యలు తమ ఆందోళనను అణచివేయలేవని ఈ సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్రంతో చర్చల విషయమై తామింకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అటు-పంజాబీ సింగర్, నటుడు దిల్ జిత్ దోసంజీ ఘాజీపూర్ బోర్డర్ చేరుకొని అన్నదాతలకు మద్దతు తెలపనున్నారు.