AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడ దాకా.. కాంగ్రెస్‌తోనే…

రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం పరిస్థితి కాస్త విషమించడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్‌టిట్యూట్‌ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.15 గంటలకు గుండెపోటుకు గురవ్వడంతో.. వెంటిలేటర్ అమర్చారు. 3.55 నిమిషాలకు తుది శ్వాస […]

కడ దాకా.. కాంగ్రెస్‌తోనే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2019 | 5:57 AM

Share

రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం పరిస్థితి కాస్త విషమించడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్‌టిట్యూట్‌ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.15 గంటలకు గుండెపోటుకు గురవ్వడంతో.. వెంటిలేటర్ అమర్చారు. 3.55 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు.

షీలా జననం..

భారత రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా పేరుగాంచిన షీలా.. దేశ రాజధానికి 15ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా సేవలందించారు. షీలా 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తలాలో జన్మించారు.

షీలా సంతానం.. షీలాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు సందీప్‌ దీక్షిత్‌, కుమార్తె లతికా సయ్యద్‌. షీలా భర్త వినోద్‌ దీక్షిత్‌ ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లో పనిచేసేవారు. ఆయన గతంలో గుండెపోటుతో మరణించారు. కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ 15వ లోక్‌సభకు తూర్పు దిల్లీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

రాజకీయ అరంగేట్రం..

ఢిల్లీ యూనివర్శిటీ నుంచి చరిత్రలో మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమె.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. షీలా మామగారు ఉమాశంకర్‌ దీక్షిత్‌ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇందిరా హయాంలో ఆయన కేబినెట్‌ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో షీలా తన మామయ్యకు ఎన్నో విషయాల్లో సాయంగా ఉండేవారట. పాలనా వ్యవహారాల్లో ఆమె ప్రతిభను మెచ్చిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆమెను యునైటెడ్‌ నేషన్స్‌ కమిషన్‌లో భారత ప్రతినిధిగా నామినేట్‌ చేశారు.

1984లో యూపీలోని కన్నౌజ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986-89 మధ్య కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన షీలా.. అదే సంవత్సరం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి.. 2013 వరకు రాజధానికి సీఎంగా కొనసాగారు.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌ ఓటమిపాలైన తర్వాత 2014 మార్చిలో షీలా కేరళకు గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే.. అదే సమయంలో 2014లో కేంద్రంలో యూపీఏ ఓటమి పాలై.. ఎన్డీఏ అధికారం చేపట్టడంతో.. ఆమె ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో షీలాను కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆమె ఆసక్తి చూపలేదు. తిరిగి ఢిల్లీకి వచ్చిన ఆమె ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

షీలా మృతి పట్ల ప్రముఖుల సంతాపం..

పలువురు ప్రముఖుల సంతాపం షీలా దీక్షిత్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు