AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR lucky ఆ విషయంలో కేసీఆర్ లక్కీ… పాపం జగనే!

బిజీబిజీగా వున్న ముఖ్యమంత్రులిద్దరిలో కేసీఆర్ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు అదనంగా మరో భారం తలెత్తడంతో ఆయన పరిస్థితి పాపం అనిపించేలా కనిపిస్తోంది.

KCR lucky ఆ విషయంలో కేసీఆర్ లక్కీ... పాపం జగనే!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Apr 04, 2020 | 12:32 PM

Share

KCR is luckier than Jagan: రెండు తెలుగు రాష్ట్రాలు కరోనాపై యుద్దంలో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. ప్రభుత్వాల కృషి ఒకవైపు కొనసాగుతుంటే.. పాలకులకు సవాల్ విసురుతున్నట్లుగా కరోనా పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూనే వున్నాయి. ఈ క్రమంలో ఒకవైపు కరోనా నియంత్రణ చర్యలను సమీక్షించుకోవాలి.. ఇంకోవైపు లాక్ డౌన్‌ను పక్కాగా అమలు పరుచుకోవాలి.. ఇలా రౌండ్ ద క్లాక్ బిజీబిజీగా వున్న ముఖ్యమంత్రులిద్దరిలో కేసీఆర్ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు అదనంగా మరో భారం తలెత్తడంతో ఆయన పరిస్థితి పాపం అనిపించేలా కనిపిస్తోంది.

కరోనా నియంత్రణకు రెండు రాష్ట్రాల్లో యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఏ మాత్రం తగ్గడం లేదు. కేంద్రం నుంచి సహకారం పొందే విషయంలోను ఇద్దరు ఎవరికి వారే సాటి అనిపించుకుంటున్నారు. కానీ తెలంగాణలో లేనిది… ఏపీలో ఉన్నది ఒక్కటే అంశం. ఆ అంశమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అదనపు టాస్క్‌ని పురమాయిస్తోంది.

తెలంగాణలో ప్రతిపక్షం పెద్దగా లేదు. ఆ మాటకొస్తే.. కాంగ్రెస్ నేతలు ఉన్నారా లేరా అన్నట్లు మాట్లాడుతున్నారు తాజా పరిస్థితి మీద. ఇటు తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానం ఆదేశాలో లేక ఎమర్జెన్సీ పరిస్థితిలో రాజకీయాలెందుకు అనుకున్నారో గానీ ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే.. కేసీఆర్ ప్రభుత్వ కరోనా నియంత్రణ చర్యలను ప్రశంసించారు కూడా.

అదే సమయంలో ఏపీలో విపక్ష టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలను, లాక్ డౌన్ అమలును తప్పుపడుతోంది. రాజకీయంగా ఏ మాత్రం తగ్గకుండా విమర్శలు గుప్పిస్తోంది. దాంతో కరోనా నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అప్ డేట్స్‌ని ప్రజలకు వివరిస్తూనే.. రాజకీయంగా ఎదురవుతున్న విమర్శలను తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ఎదురవుతోంది. దాంతో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో విపక్షంపై ఎదురుదాడి చేయించాల్సిన పరిస్థితి జగన్‌కు కలుగుతోంది.

రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తున్నవారు అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలిస్తే… ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదనపు భారాన్ని మోస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. సో.. నిజమే కదా.. రాజకీయంగా పెద్దగా విమర్శలు ఎదురు కాకపోవడంతో కరోనా నియంత్రణపైనే కేసీఆర్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది కదూ?