వలపు వల విసిరి.. దగ్గరవుతుంది.. ప్రముఖ వ్యక్తులే టార్గెట్‌.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్‌ దందా షురూ, మాయలేడీ నిజ స్వరూపం

ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయింది ఒక మాయలేడీ. బంగారు ఆభరణాలు టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్న కేడీ లేడి తో పాటు ముగ్గురిని..

  • Venkata Narayana
  • Publish Date - 8:03 am, Sun, 27 December 20
వలపు వల విసిరి.. దగ్గరవుతుంది.. ప్రముఖ వ్యక్తులే టార్గెట్‌.. ఆ తర్వాత  బ్లాక్‌మెయిల్‌ దందా షురూ, మాయలేడీ నిజ స్వరూపం

ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయింది ఒక మాయలేడీ. బంగారు ఆభరణాలు టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్న కేడీ లేడి తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపించారు తెలంగాణ పోలీసులు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ మాయ లేడి పలువురి ప్రముఖులను వలలో వేసుకుని బ్లాక్‌ బెయిల్‌కు పాల్పడుతున్నట్టు తేల్చారు. మాయలాడి గురించి ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగిన జగిత్యాలజిల్లా పోలీసులు ఎట్టకేలకు ఈ మాయలేడీని పట్టుకున్నారు. ఇక ఈమె దందా సంగతికొస్తే, ప్రముఖ వ్యక్తులను టార్గెట్‌ చేసుకుని, వలపు వల విసిరి తన చెంతకు చేర్చుకుంటుంది ఈ మాయలేడీ. ఎవరు లేని ప్రదేశంలోకి పిలిపించుకుని వారికి సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌ చేస్తుంది. బాధితులను బెదిరించి వారి దగ్గరి నుంచి నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటోంది.

అయితే ఓ ప్రముఖుడు, ఈ కిలాడీ లేడీపై పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కిలాడీ లేడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వారి దగ్గరి నుంచి 14 తులాల బంగారంతో పాటు 7 వేల రూపాయల నగదు, 1 బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ మాయలేడి వలలో పడి ఎవరైనా మోసపోయి ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని, వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిటిట్యూట్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపారు జిల్లా ఎస్‌పి. ఇలాంటి వారి వలలో పడి మోసపోవద్దని ప్రజలకు సూచించారు ఎస్‌పి. ఇంకా కిలాడీ లేడీ ఎంతమందిని మోసం చేసింది? ఎంత పెద్ద మొత్తంలో నగదు, నగలను దోచుకుందో ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని పోలీసులు తెలిపారు.