5

విదేశాంగ మంత్రికి జగన్ లేఖ..వారిని రప్పించాలని విఙ్ఞప్తి

విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. విదేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి రప్పించే విషయంలో చొరవ చూపాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.

విదేశాంగ మంత్రికి జగన్ లేఖ..వారిని రప్పించాలని విఙ్ఞప్తి
Follow us

|

Updated on: May 02, 2020 | 6:49 PM

విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం లేఖ రాశారు. విదేశాలలో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి రప్పించే విషయంలో చొరవ చూపాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. సంక్షోభ సమయంలో అనేక దేశాలలో భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం సుబ్రమణ్యం జయశంకర్‌కు వివరించారు ముఖ్యమంత్రి జగన్.

కువైట్ వంటి దేశాలలో ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియలో విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. కోవిడ్ నియంత్రణ ప్రణాళికలో భాగంగా గల్ఫ్ దేశాలలో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఈ లెక్కన లాక్ డౌన్ ముగిసిన వెంటనే వేలాది మంది భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం వుందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి సూచించారు.

‘‘ఇతర రాష్ట్రాల వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు వలస కార్మికులు అధిక సంఖ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్నారు.. విదేశీ విమాన సర్వీసులు ప్రారంభం అయితే వారంతా స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.. దానికి అనుగుణంగా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది..’’ అని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు.

విదేశాల నుంచి తెలుగువారు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, దానికి అనుగుణంగా క్వారెంటైన్ ఏర్పాట్లను తమ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటోందని జగన్ కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. తాజా పరిస్థితిని, విదేశాలలో ఉన్న భారతీయుల స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలని కేంద్ర మంత్రికి జగన్ సూచించారు.