చైనా కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఐటీ ఆరా
ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న చైనా కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఇన్ కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ స్కాంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసును విచారించేందుకు ఇన్ కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌తో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగాయి. ఈ రెండు సంస్థల అధికారులు హైదరాబాద్ సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న చైనా కంపెనీ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా రూ.1106 కోట్లు చైనాలోని బీజింగ్ టుమారో కంపెనీకి బదలీ చేయడంపై అధికారులు దృష్టి సారించారు. కేవలం రెండు అకౌంట్లు ద్వారా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌కి నగదు బదిలి చేసినట్లు అధికారులు గుర్తించారు. డాకిపే, లింక్ యు అనే కంపెనీ అకౌంట్ల ద్వారా రూ.1106 కోట్లు బదిలి అయినట్లు తేల్చారు. పేటీయం ద్వారా చైనా కంపెనీ డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేటీఎం ప్రతినిధులకు సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో భాగంగా పేటీఎం సంస్థ ప్రతినిధులు సీసీఎస్ ఎదుట హాజరయ్యారు. ఆరు నెలల్లో రూ.646 కోట్లను హెచ్ఎస్‌బీసీ బ్యాంక్‌కు బదిలీ చేసినట్లు పేటీఎం అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో వచ్చిన డబ్బులను చైనా కంపెనీ పేటీఎంలో డిపాజిట్ చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. 2019 లో కేవలం ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన బీజింగ్ టుమారో కంపెనీ ఈ ఏడాది ఆరు మాసాల్లోనే రూ. 1102 కోట్ల రూపాయలు వ్యాపారం చేసింది. లాక్‌డౌన్ సమయంలోనే ప్రజల సొమ్మును ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా ఈ కంపెనీ కొట్టేసింది.