AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: గుడ్‌న్యూస్ అంటే ఇది.. హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలు.. ముందుగా ఈ ప్రాంతంలోనే..

హైదరాబాద్ నగరవాసులకు మరో వినూత్న రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రయాణికులకు చివరి మైలు సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ‘పాడ్ ట్యాక్సీ’లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) పేరుతో తీసుకురానున్న ఈ వ్యవస్థ మెట్రో స్టేషన్లను నేరుగా ప్రధాన కార్యాలయాలు, ఐటీ హబ్‌లు, నివాస ప్రాంతాలతో అనుసంధానించనుంది.

Hyderabad: గుడ్‌న్యూస్ అంటే ఇది.. హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలు.. ముందుగా ఈ ప్రాంతంలోనే..
Pod Taxis
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Feb 26, 2026 | 11:11 AM

Share

హైదరాబాద్ నగరవాసులకు మరో వినూత్న రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రయాణికులకు చివరి మైలు సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ‘పాడ్ ట్యాక్సీ’లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) పేరుతో తీసుకురానున్న ఈ వ్యవస్థ మెట్రో స్టేషన్లను నేరుగా ప్రధాన కార్యాలయాలు, ఐటీ హబ్‌లు, నివాస ప్రాంతాలతో అనుసంధానించనుంది. ప్రస్తుతం నగరంలో రోజుకు సుమారు ఐదు లక్షల మంది మెట్రో సేవలను వినియోగిస్తున్నారు. అయితే స్టేషన్‌ దిగిన తర్వాత గమ్యస్థానానికి చేరుకోవడం ప్రయాణికులకు కష్టసాధ్యంగా మారుతోంది. బస్సులు, ఆటోలు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం, అధిక ఛార్జీలు, ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రోడ్ల ట్రాఫిక్‌కు సంబంధం లేకుండా ఎలివేటెడ్ ట్రాక్‌లపై నడిచే పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొదటి దశలో రాయదుర్గం–కూకట్‌పల్లి, రాయదుర్గం–హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సిటీ, సచివాలయ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) మోడల్‌లో ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఇందుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.

పాడ్ ట్యాక్సీలు పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో, డ్రైవర్ లేకుండా నడుస్తాయి. గంటకు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వాహనాల్లో ఒక్కోటి 6 నుంచి 8 మంది వరకు ప్రయాణించవచ్చు. గంటకు దాదాపు 10 వేల మందిని గమ్యస్థానాలకు చేర్చగల సామర్థ్యం ఉంటుంది. విద్యుత్ లేదా బ్యాటరీ ఆధారంగా నడవడం వల్ల కాలుష్య సమస్య కూడా ఉండదు.

ముందస్తుగా బుకింగ్ చేసుకునే సదుపాయం ఉండటంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే ముంబైలో ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉండగా, త్వరలోనే హైదరాబాద్‌లోనూ పాడ్ ట్యాక్సీలు నగర రవాణాలో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయి. ఈ ప్రక్రియ సజావుగా సాగితే.. కొన్నేళ్లల్లోనే.. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us