IT Act 2021: 50 లక్షల యూజర్లు దాటితే ప్రధాన మీడియానే.. సంస్థలన్నీ సమాచారమివ్వాల్సిందే..
significant social media intermediaries : సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ కోసం దేశంలో గత కొన్నిరోజులుగా గళం వినిపించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం..
social media intermediaries : సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ కోసం దేశంలో గత కొన్నిరోజులుగా గళం వినిపించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. సోషల్ మీడియా, ఓటీటీ మాధ్యమాల నియంత్రణకు పక్కా మార్గదర్శకాలను రూపొందించి ఈనెల 26వ తేదీన విడుదల చేసింది. వివధ సోషల్‌మీడియా మాధ్యమాలను.. సాధారణ సంస్థలు, ప్రధాన సంస్థలుగా విభజించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై శనివారం మరింత స్పష్టత వచ్చింది. కనీసం 50 లక్షలమంది లేదా ఆపై వినియోగదారులున్న సామాజిక మాధ్యమ సంస్థలకు తాము తాజాగా ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆ సంస్థలను సోషల్ మీడియాలో కీలక సంస్థలుగా భావిస్తామని కేంద్రం ఉత్తర్వుల్లో వెల్లడించింది.
అయితే.. 50 లక్షల కంటే ఎక్కువ ఖాతాదారులు ఉన్న సంస్థలు ప్రధాన మాధ్యమం పరిధిలోకి వస్తాయని, అంతకంటే తక్కువ యూజర్స్ ఉన్న సంస్థలను సాధారణ మాధ్యమాల కింద పరిగణిస్తామని ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రం ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. ఈ కీలక సంస్థలు నిబంధల అమలు పర్యవేక్షణ అధికారి, నోడల్ కాంటాక్ట్ అధికారి, ఫిర్యాదుల రెసిడెంట్ అధికారి అనే ముగ్గురిని నియమించాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లోనే నివసించాల్సి ఉంటుంది. సంస్థ తొలగించిన కంటెంట్‌కు సంబంధించిన సమగ్ర సమాచారంతో ప్రతినెలా ఒక నివేదికను వారు తయారు చేసి నివేదికను సమర్పించాలి. ప్రభుత్వం లేదా కోర్టులు నిషేధించిన కంటెంట్‌ను ఆయా సంస్థలు తమ ప్లాట్‌ఫాంలపై 36 గంటలలోపు తొలగించాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు భంగం వాటిల్లే కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన తొలి వ్యక్తి వివరాలను, ఆ తర్వాత షేర్ చేసిన వ్యక్తుల వివరాలను కోర్టులు అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ మార్గదర్శకాల్లోని మూడో భాగంలో 16వ నిబంధన అత్యవసర సమయంలో ఇంటర్నెట్‌ను నిలిపేసే వీలు కల్పిస్తుందని, ఇది 2009 నుంచే మార్గదర్శకాల్లో ఉందని కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read: