దేశంలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ నుంచి రూ.2,000 నోట్ల వరకు మారుతున్న నిబంధనలు.. ఎస్‌బీఐలో కేవైసీ తప్పనిసరి

దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. గ్యాస్ ధరలు, బ్యాంకింగ్ సర్వీసుల దగ్గరి నుంచి వాహనాల వరకు పలు విషయాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.

  • Balaraju Goud
  • Publish Date - 9:16 am, Sun, 28 February 21
దేశంలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ నుంచి  రూ.2,000 నోట్ల వరకు మారుతున్న నిబంధనలు.. ఎస్‌బీఐలో కేవైసీ తప్పనిసరి

New rules from march 1 : దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. గ్యాస్ ధరలు, బ్యాంకింగ్ సర్వీసుల దగ్గరి నుంచి వాహనాల వరకు పలు విషయాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి. దీంతో ఒకటో తేదీ నుంచి ఏ ఏ అంశాలు మారిపోయాయో తెలుసుకోండి. మీపై ఎంత భారం పడుతుందో తెలుసుకోండి. దీనికి అనుగుణంగా ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలో ఆలోచించుకోండి. మార్చి 1 నుంచి మారిన అంశాలేవో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

గ్యాస్ ధరలు

మన దేశంలో దాదాపు ప్రతి కుటుంబానికి ఎల్‌పిజి కనెక్షన్ ఉంది. అంతేకాదు గ్యాస్ అనేది కుటుంబానికి అత్యంత ఉపయోగాన్ని ఇచ్చే నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో ఎల్‌పిజి ధరల పెరుగుదల సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. గతంలో ప్రతి నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకునేది. కానీ, గత కొంతకాలంగా అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులతో ధరల పెంపులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఫిబ్రవరి నెలలో మూడు సార్లు గ్యాస్ ధరలను సవరించారు. అయితే, ఇకపై చమురు ధరల పెరుగుదలతో గ్యాస్ ధరలను లింక్ చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ కొత్త నిబంధన మార్చి 1నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్ ధర రూ.774గా ఉంది.

ఫాస్టాగ్ రూల్స్

వాహన ప్రియులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫాస్టాగ్స్ ఫిబ్రవరి 28 వరకు ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. అయితే ,మార్చి 1 నుంచి మాత్రం ఈ సౌలభ్యం ఉండదు. ఫాస్టాగ్స్ తీసుకోవడానికి మీ జేబులోని డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఫాస్టాగ్ కోసం రూ.100 పెట్టాలి. ఫాస్టాగ్ ద్వారా రీచార్జ్ చేయించుకోకుంటే ఇకపై మీరు ప్రయాణించే మార్గంలో అదనంగా ఫైన్ కట్టాల్సి ఉంది. ఈ నిబంధన కూడా మార్చి 1నుంచి అమలులోకి రానుంది.

ఎస్‌బీఐ వినియోగదారులకు కేవైసీ తప్పనిసరి

ఇకపై స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ సేవలను కొనసాగించాలంటే కేవైసీని తప్పనిసరి చేసింది.

మీకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? అయితే, ఈ ముఖ్య గమనికను పరిశీలించండి. ఎస్‌బీఐలో అకౌంట్ కలిగి ఉండి.. నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయని వారు ఇకపై బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలాంటి సేవలు పొందలేరు. అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్లను నిర్వహించలేరు. స్టేట్ బ్యాంక్ గతంలోనే ఈ అంశానికి సంబంధించి ఒక నోటీస్ జారీ చేసింది. అలాగే కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు కూడా పంపింది.

పాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్ బంద్

ప్రైవేట్ రంగ దేశీ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్ మీ ఫోన్‌లో ఇక పనిచేయదు. బ్యాంక్ ఇప్పటికే ఈ విషయాన్ని కస్టమర్లకు తెలియజేసింది. మీరు ఇప్పటికీ కూడా పాత యాప్‌నే ఉపయోగిస్తే.. వెంటనే దాన్ని డిలేట్ చేయండి. కొత్త యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక, మార్చి 1నుంచి పాత యాప్ ద్వారా సేవలను నిలిపివేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పేర్కొంది.

జీఎస్‌టీ పెంపు..

జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను)కి సంబంధించిన కొత్త రూల్ ఒకటి అమలులోకి వచ్చేసింది. లాటరీకి జీఎస్‌టీ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. కొత్త రూల్స్ ప్రకారం.. లాటరీపై ఇక 28 శాతం జీఎస్‌టీ పడుతుంది. జీఎస్‌టీ కౌన్సిల్ 2019 డిసెంబర్ నెలలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ లాటరీలపై 28 శాతం జీఎస్‌టీ పడుతుంది. దీంతో లాటరీలు మరింత ప్రియం కానున్నాయి.

రూ.2000 నోట్లు బంద్

ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ తన ఉద్యోగులకు, ఇతర అధికారులకు రూ.2,000 నోట్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఏటీఎంలలో రూ.2,000 నోట్లను పెట్టవద్దని బ్యాంక్ వాటి బ్రాంచ్‌లకు తెలియజేసింది. మార్చి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీంతో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో ఇక రూ.2000 నోట్లు కనిపించవు. అంటే రూ.100, రూ.500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేటప్పుడు రూ.2,000 నోట్లు రావడం వల్ల బ్యాంక్ ఖాతాదారులకు చిల్లర సమస్య వస్తోందని బ్యాంక్ పేర్కొంది. కస్టమర్లు రూ.2,000 నోటును మార్చుకోవడం కష్టమైందని తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రూ.2,000 నోట్లు కావాలనుకునేవారు నేరుగా దగ్గరలోని బ్యాంకుల ద్వారా పొందవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.

టీవీ యూజర్లకు తీపికబురు

ఇకపోతే డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్లు ట్రాన్ ఎన్‌టీవో 2.0 రూల్స్‌‌ను మార్చి 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో యూజర్లకు తక్కువ ధరలోనే 200 ఫ్రీ ఎయిర్ టు ఛానెల్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే మల్టీ టీవీ కనెక్షన్‌కు తక్కువ చార్జీలు చెల్లించొచ్చు. ట్రాయ్ డీటీహెచ్ అండ్ కేబుల్ టీవీ రెగ్యులేషన్స్ మార్పు వల్ల మొత్తంగా డీటీహెచ్, కేబుల్ టీవీ యూజర్లపై భారం తగ్గనుంది. కొత్త నిర్ణయంతో నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు దిగి వస్తుంది. అంతేకాకుండా ఆపరేటర్లు దీర్ఘకాల ప్లాన్లు ఎంచుకునే కస్టమర్లకు డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందించాల్సి ఉంటుంది.

Read Also… Covid Vaccine: జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్.. అందుబాటులోకి రానున్న సింగిల్ డోస్..