Telangana TDP: తెలంగాణ టీడీపీలో లుకలుకలు
Infight in Telangana TDP increasing day by day: తెలంగాణ టీడీపీలో ముసలం ముదురుతోంది. పార్టీ ఇప్పటికే పూర్తిస్థాయిలో ఖాళీ అయినా మిగిలిన కొద్ది మంది మధ్య కూడా ఆధిపత్యపోరు నెలకొంది. మహిళా నేతల మధ్య పోరు తారా స్థాయికి చేరింది. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న తమకు కాదని.. కొత్తగా పార్టీ లో చేరిన వారికి తమపైనే అజమాయిషీ చేసే ఛాన్స్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు పార్టీ నేతలు. పార్టీ నేతల తీరుతో […]
Infight in Telangana TDP increasing day by day: తెలంగాణ టీడీపీలో ముసలం ముదురుతోంది. పార్టీ ఇప్పటికే పూర్తిస్థాయిలో ఖాళీ అయినా మిగిలిన కొద్ది మంది మధ్య కూడా ఆధిపత్యపోరు నెలకొంది. మహిళా నేతల మధ్య పోరు తారా స్థాయికి చేరింది. ఏళ్ళ తరబడి పార్టీని నమ్ముకుని ఉన్న తమకు కాదని.. కొత్తగా పార్టీ లో చేరిన వారికి తమపైనే అజమాయిషీ చేసే ఛాన్స్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నారు పార్టీ నేతలు. పార్టీ నేతల తీరుతో ఉన్న కొద్దిమంది మహిళా నేతలు సైతం పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు సమాచారం.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణ టీడీపీ పార్టీ పూర్తిగా తెరమరుగై పోయింది. ఎన్నికల్లో కూడా నామామాత్రంగా పోటీ చేస్తూ కాలం వెళ్ళదీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఉన్న పార్టీ అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి లో చేరి కనీసం గౌరవ ప్రదమైన సీట్లు సాధించుకో లేకపోయింది. దీంతో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. అయితే తమకు రాజకీయంగా జీవం పోసిన పార్టీని వీడలేక పార్టీ అభివృద్దికి కృషి చేస్తామంటూ పార్టీలోనే కొనసాగుతున్నారు కొంత మంది నేతలు. పార్టీ అధినేత తమకు ఎప్పటికైనా ఏవైనా పదవులు కట్టబెడుతారన్న ఆశతో వీరంతా పార్టీలోనే కొనసాగుతున్నారు. పార్టీలోని వివిధ విభాగాల్లో నేతలు పదవుల ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వారికి స్థానిక పార్టీ నేతల తీరు తీవ్ర నిరాశనే మిగిలిస్తోంది.
ఇక ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్న తమను కాదని పార్టీలో కొత్తగా చేరిన జ్యోత్స్నకు పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు తెలుగు మహిళా విబాగం నేతలు. పార్టీనే నమ్ముకున్న కాట్రగడ్డ ప్రసన్న, కిరణ్మయి, అరుణ, రేవతీ చౌదరి వంటి పార్టీ సీనియర్ నేతలను కాదని జ్యోత్స్నకు అధ్యక్ష పదవి ఎలా కట్టబెడతారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు రమణ తీరుతో తెలుగు మహిళా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వ్యవహారాల్లో ఎలాంటి అనుభవం లేని జ్యోత్స్నకు కీలక పదవి ఎలా అప్పజెప్తాతారని ప్రశ్నిస్తున్నారు. ఎల్ రమణ తీరుకు నిరసనగా కొంత మంది నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుండగా .. మరికొంద మంది మాత్రం పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. పార్టీలో సీనియర్‌గా ఉన్న రేవతీ చౌదరితో పాటు కిరణ్మయిలు బీజేపీలో చేరేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ మొదలు పెట్లారు. బీజేపీ సీనియర్ నేతలతో టచ్‌లోకి వెళ్ళిన వారు నేడో రేపో బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే బాటలో మరికొంత మంది కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలుచెబుతున్నాయి.
తెలంగాణ ఏర్పాటయ్యాక అధ్యక్షుడిగా ఎల్.రమణను నియమించింది పార్టీ. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు కొత్తకోట దయాకర్ రెడ్డి, రావుల చంద్ర శేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి వంటి నేతలు పార్టీలో అజమాయిషీ చెలాయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పార్టీ కేడర్. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి కాకుండా తమకు నచ్చిన వారికే పార్టీ పదవులు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి నాయకత్వం. క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ నేతల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా పార్టీనే నమ్ముకున్న తమకు కనీసం గౌరవం ఇవ్వడం లేదంటున్నారు. పార్టీ అభివృద్ది కోసం కేటాయిస్తున్న నిదులను సైతం వారే పంచుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎల్ రమణ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారంటున్నారు.
రాష్ట్ర పార్టీలో ఉన్నదే వేళ్ళ మీద లెక్కబెట్టే నేతలు. అధ్యక్షుడు ఎల్.రమణ తీరును వ్యతిరేకిస్తూ పార్టీ వీడేందుకు సిద్దమవుతున్నారు. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబెల్లి దయాకర్, గరిక పాటి, పెద్దిరెడ్డి వంటి ముఖ్యనేతలు పార్టీ వీడుతున్నా నోరు మెదపలేదు ఆయన. దీంతో కావాలనే ఉన్న నేతలకు పొగబెట్టి బయటకు పంపుతూ పార్టీని పూర్తిగా భూ స్థాపితం చేసే పనిలో ఉన్నాడా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పార్టీ కేడర్.