ఉగ్రమూకల చెరలో తెలంగాణ యువకుడు.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి..
ఆ తల్లిదండ్రులు.. కన్న కొడుకు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కొడుకు ఎప్పుడు వస్తాడా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొడుకు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ఆ తల్లిదండ్రుల కుమారుడికి ఏమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాదాద్రి జిల్లాలో బోర్ వెల్స్ రిగ్ యజమానులు ఎక్కువగా ఉంటారు. దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఈ బోర్ వెల్ రిగ్స్ పనిచేస్తుంటాయి. ఈ జిల్లా నుంచి అనేకమంది బోర్ వెల్స్ పై పనిచేసేందుకు వివిధ దేశాలకు వెళుతుంటారు. భువనగిరి మండలం బండ సోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య, మహేశ్వరి దంపతులకు ఇద్దరు కొడుకులు. వారిలో చిన్న కొడుకు ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ బోర్‌వెల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. చురుకుగా ఉండే ప్రవీణ్ కంపెనీ తరఫున గత ఏడాది నవంబరులో దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. దక్షిణాఫ్రికాలోని మాలి రాష్ట్రంలో కోబ్రి ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కంపెనీ బోరు బండ్ల పనితీరును పర్యవేక్షిస్తుంటాడు. కోబ్రి ప్రాంతంలో విధులు ముగించుకుని గత నెల 23న కొద్ది దూరంలో ఉన్న తన షెల్టర్ కు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో జేఎన్‌ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు ప్రవీణ్ ను కిడ్నాప్ చేశారు.
ప్రతిరోజు ప్రవీణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. గత నెల 23వ తేదీ నుండి ప్రవీణ్ మాట్లాడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం కంపెనీ ప్రతినిధులు ప్రవీణ్ కిడ్నాప్ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.
జేఎన్‌ఐఎం సంస్థకు చెందిన ఉగ్రవాదులు గతంలోనూ ఆ ప్రాంతంలో ఇదే సంస్థకు చెందిన కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు. బోర్‌వెల్ కంపెనీ ప్రతినిధులు భారత రాయబార కార్యాలయం అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
