దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ టెస్ట్ ఎంతమందికి చేశారంటే..

దేశంలో కొవిడ్‌-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ టెస్ట్ ఎంతమందికి చేశారంటే..
Follow us

|

Updated on: Jun 10, 2020 | 5:18 PM

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా కల్లోలాన్ని సృష్టిస్తోంది. దేశంలోనూ చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేంద్రం కరోనా కట్టడికి అనేక చర్యలు చేపడుతోంది. అయినా అంతకంతకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కొవిడ్‌-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధన మండలి(ICMR)కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేసింది. ప్రతిరోజు దాదాపు లక్షా 45వేల కొవిడ్‌ నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50,61,332 మంది నుంచి కొవిడ్‌-19 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఇక భారత్‌లో కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్‌ పద్దతిని ఐసీఎంఆర్‌ అనుసరిస్తోంది. దీనితోపాటు క్షయవ్యాధి నిర్ధారణకు చేసే ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాన్ని కూడా వినియోగిస్తోంది. దేశంలో ఉన్న 823 ల్యాబ్‌ల ద్వారా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను ఐసీఎంఆర్‌ చేపడుతోంది. ఇందుకు కోసం 590 ప్రభుత్వ లాబొరేటరీలను వినియోగిస్తుండగా.. మరో 233 ప్రైవేట్ ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దేశంలోని మొత్తం ల్యాబ్‌లలో దాదాపు 520 ల్యాబ్‌లలో ఆర్‌టీ-పీసీఆర్‌, 240 ల్యాబ్‌లలో ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 63 కేంద్రాల్లో సీబీనాట్‌ పరీక్షలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,583కి చేరగా వీరిలో 7,745 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 9,985 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రధాన నగరాల్లో ర్యాండంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ అయా రాష్ట్రాలకు సూచించింది,