దేశంలో ఉత్తమ నివాసయోగ్య నగరంగా హైదరాబాద్
మరోసారి హైదరాబాద్ మహానగరానికి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది.
మరోసారి హైదరాబాద్ మహానగరానికి ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. పర్యాటకుల ఆకర్షించడంలో ముందు వరుసలో నిలుస్తోంది. జనం అభిరుచులకు అనుగుణంగా సరైన పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడం, అక్కడికి చేరుకునేలా పర్యాటకులకు సాయంచేసే హాలిడిఫై.కామ్ వెబ్‌సైట్ ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య కాలంలో దేశంలోని 34 నగరాల్లో సర్వే నిర్వహించింది. హైదరాబాద్ నగరాన్ని ఉత్తమ నగరంగా ఆ సంస్థ నిర్ధారించిందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
నివాస వసతి, ఉపాధి అవకాశాలు, ఇతరత్రా అంశాల ఆధారంగా జరిగిన సర్వేలో భాగ్యనగరం మొదటిస్థానం పొందినట్లు తెలిపింది. హాలిడిఫై.కామ్ సంస్థ దేశవ్యాప్తంగా పర్యాటకులు చూడదగిన ప్రదేశాలు, అక్కడున్న సౌకర్యాలు, సంస్కృతి, సంప్రదాయాలపై సర్వే నిర్వహించింది. వారి అధ్యయనంలో హైదరాబాద్ ముందు నిలవడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. సర్వేలో హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో ముంబయి, పుణె, చెన్నై, బెంగళూరు నగరాలు నిలిచాయి. చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ కోట, రామోజీ ఫిల్మ్ సిటీ చూడదగ్గవని, హైదరాబాద్ పర్యటనకు సెప్టెంబరు నుంచి మార్చి వరకు మంచి సమయమని సర్వే సంస్థ పేర్కొంది’ అని సర్కారు ఆ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన జేఎల్‌ఎల్-2020 సూచీలోనూ హైదరాబాద్ ప్రపంచంలోనే ‘ఉత్తమ డైనమిక్ సిటీ’గా గుర్తింపు సాధించిన విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది.