AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ టిక్కెట్ల కోసం ఖతర్నాక్ పోటీ.. ఉత్తమ్‌కు బిగ్ టాస్క్

తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మిగిలిన పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ ఎలా వున్నా కాస్త స్వేచ్ఛ ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో ...

కాంగ్రెస్ టిక్కెట్ల కోసం ఖతర్నాక్ పోటీ.. ఉత్తమ్‌కు బిగ్ టాస్క్
Rajesh Sharma
|

Updated on: Sep 21, 2020 | 2:01 PM

Share

తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. మిగిలిన పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీ ఎలా వున్నా కాస్త స్వేచ్ఛ ఎక్కువగా వుండే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కోసం పదుల సంఖ్యలో నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం టీపీసీసీకి సవాలుగా మారుతోంది. మరోవైపు మిత్ర ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని తమకు కేటాయించి, తెలంగాణ ఉద్యమ జేఏసీ నేతగా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డికి మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) కోరుతోంది. అసలే తమ పార్టీలోనే నేతలు పెద్ద సంఖ్యలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడుతుంటే.. ఆ స్థానాన్ని కోదండరామ్ రెడ్డికి ఎక్కడ కోటాయించేదని టీపీసీసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ ట్రెజరర్ జి.నారాయణ రెడ్డి తనకు ఢిల్లీ స్థాయిలో వున్న సంబంధాలను వాడుకుని టిక్కెట్ పొందేందుకు యత్నిస్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కూడా తనకున్న అన్ని సంబంధాలను వినియోగించుకుని, ఎమ్మెల్సీ టిక్కెట్ పొందేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ పాల్గొన్న సభల్లో అధినేత ప్రసంగాన్ని అనువదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఆకర్షించిన శ్రవణ్ తనకు అదే అదనపు అర్హత కాబోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. రాములు నాయక్, మానవతా రాయ్, కత్తి వెంకట స్వామి, దామోదర్ రెడ్డి తదితరులు కూడా నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

అదే సమయంలో ఇదే నియోజకవర్గాన్ని మిత్ర ధర్మంగా తమకు కేటాయించాలని టీజేఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీని కోరుతున్నారు. ఈ మేరకు టీజేఎస్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీతోపాటు టీడీపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు లేఖలు కూడా రాసినట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న నేపథ్యంలో టీజేఎస్ అభ్యర్థనను టీపీసీసీ ఆమోదించకపోవచ్చని తెలుస్తోంది.

మరోవైపు హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలోను కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తున్న నేతల జాబితా పెద్దగానే కనిపిస్తోంది. మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఇందిరా శోభ, రామ్మోహన్ రెడ్డి, కేఎల్‌ఆర్ తదితరులు రేసులో వున్నారు. మొత్తమ్మీద 30 మంది వరకు హైదరాబాద్-మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల స్థానం నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

రెండు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఆశావహుల జాబితాను వడబోసి… నలుగురైదుగురితో జాబితాను రూపొందించిన మీదట తనతో చర్చలకు రావాలని కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీగా నియమితులైన మాణిక్యం ఠాకూర్ టీపీసీసీ నాయకత్వానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆశావహుల వడబోత కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డికి పెద్ద సవాలేనని గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.