కేఎంసీ మెడికల్ కాలేజీలో హైటెక్ మాస్ కాపీయింగ్.. నిందితులపై చర్యలు నిల్.. చేతులు మారిన లక్షల రూపాయలు..!
శంకర్ దాదా జిందాబాద్ సినిమా గుర్తుందా? మర్చిపోయే సినిమానా అది. ఆ సినిమాలో హీరో చిరంజీవి(శంకర్ ప్రసాద్) తన రివేంజ్ తీర్చుకోవడం కోసం...
శంకర్ దాదా జిందాబాద్ సినిమా గుర్తుందా? మర్చిపోయే సినిమానా అది. ఆ సినిమాలో హీరో శంకర్ ప్రసాద్(చిరంజీవి) డాక్టర్ రామలింగరాజు(పరేష్ రావల్)పై రివేంజ్ తీర్చుకోవడం కోసం డాక్టర్ అవ్వాలని నిశ్చయించుకుంటాడు. ఆ క్రమంలో డాక్టర్ అవ్వడం కోసం మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతాడు. తాను చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోగా.. బయట ఉన్న మహ్మద్ రఫీ(సూర్య) ఫోన్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాడు. సేమ్ టూ సేమ్ ఇలాంటి ఘటనే వరంగల్‌లో వెలుగు చూసింది. కాకతీయ మెడికల్ కాలేజీలో ఐదుగురు విద్యార్థులు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కేఎంసీలో ఎంబీబీఎస్ పీజీ ఫైనలియర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సీసీ కెమెరా నిఘాను తప్పించుకుని ఐదుగురు విద్యార్థులు హాజరయ్యారు. దుండగులు ముందుగా సీసీ కెమెరాల వైర్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఓ విద్యార్థి ఏకంగా మైక్రోఫోన్ రిసీవర్‌తో మూడు పరీక్షలు రాశాడు. అతనికి ఓ డాక్టర్ సహకారం అందించాడు. కళాశాల ఆవరణలో ఓ కారులో కూర్చుని ఎలాక్ట్రానిక్ డివైజ్‌తో సదరు విద్యార్ధికి సమాధానాలు చేరవేశాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది విద్యార్ధిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నవంబర్ 26, 28 డిసెంబర్ 3న జరిగిన పరీక్షల్లో విద్యార్ధి మాస్ కాపీయింగ్‌కు పాల్పడగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రిన్సిపాల్ సంధ్యారాణి ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షల రూపాయలు చేతులు మారినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.